వైట్‌బాల్‌ క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌

వైట్‌బాల్‌ క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌– జూన్‌ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధన
– అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ ప్రకటన
మ్యాచ్‌ ఫీజులో కోత, బౌండరీ లైన్‌ దగ్గర ఓ ఫీల్డర్‌ కుదింపు.. వైట్‌బాల్‌ క్రికెట్‌లో సమయం వృథాను తగ్గించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) అమలు చేస్తున్న కఠిన నిబంధనలు. అయినా, వైట్‌బాల్‌ ఫార్మాట్‌ క్రికెట్‌లో ఆశించిన గుణాత్మక మార్పులు రావటం లేదు. టీ20, వన్డే మ్యాచులు నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా ముగుస్తున్నాయి. దీంతో ఐసీసీ మరో కఠిన నిబంధనతో ముందుకొచ్చింది. వన్డే, టీ20 క్రికెట్‌లో ‘స్టాప్‌ క్లాక్‌’ నిబంధనను శాశ్వతం చేయనుంది. రెండు ఓవర్ల మధ్య విరామం 60 సెకండ్ల గడువు మూడుసార్లు మించితే.. ఫీల్డింగ్‌ జట్టుపై 5 పరుగుల పెనాల్టీ విధించనుంది. ఈ నిబంధన జూన్‌ 1, 2024 నుంచి మెన్స్‌ వైట్‌వాట్‌ క్రికెట్‌లో అమల్లోకి రానుంది. రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సైతం ఈ నిబంధన అమలు చేయనున్నారు.
నవతెలంగాణ-దుబాయ్
అంతర్జాతీయ మెన్స్‌ వైట్‌బాల్‌ క్రికెట్‌లో సరికొత్త నిబంధనల అమల్లోకి రానుంది. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ప్రయోగాత్మకంగా అమలు పరిచిన ‘స్టాప్‌ క్లాక్‌’ నిబంధన ఈ ఏడాది జూన్‌ 1 నుంచి శాశ్వతంగా అమల్లోకి రానుంది. వన్డే, టీ20 క్రికెట్‌లో మీతిమీరిన సమయం వృథాను అరికట్టేందుకు ‘స్టాప్‌ క్లాక్‌’ను అమలు చేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిసింది. ఇటీవల దుబారులో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌లో సైతం స్టాప్‌ క్లాక్‌ నిబంధన అమల్లో ఉండనుంది. ‘ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కమిటీకి (సీఈసీ)కి స్టాప్‌ క్లాక్‌ ప్రయోగాత్మక ఫలితాల నివేదికను సమర్పించారు. ఓ వన్డే మ్యాచ్‌లో కనీసం 20 నిమిషాల సమయం ఆదా ఈ నిబంధనతో చేకూరింది. సమయం వృథా నివారణలో స్పష్టమైన ఫలితాలను సీఈసీ పరిగణనలోకి తీసుకుంది. అంతర్జాతీయ వైట్‌బాల్‌ క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌ నిబంధన తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకుంది. జూన్‌ 1, 2024 నుంచి స్టాప్‌ క్లాక్‌ రూల్‌ అమలు చేయబడుతుంది’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
5 పరుగుల పెనాల్టీ
ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి రెండు ఓవర్ల మధ్య విరామం 60 సెకండ్లు మించకూడదు. తొలి ఓవర్లో చివరి బంతి పడిన తర్వాత.. 60 సెకండ్ల లోపు రెండో ఓవర్‌ తొలి బంతి పడాలి. 60 సెకండ్ల గడువును ఓ ఇన్నింగ్స్‌లో మూడుసార్లు దాటితే.. అప్పుడు ఫీల్డ్‌ అంపైర్‌ 5 పరుగుల జరిమానా విధిస్తారు. 60 సెకండ్ల సమయం మించినప్పుడు తొలి రెండు సార్లు ఫీల్డ్‌ అంపైర్‌ హెచ్చరిక జారీ చేస్తారు. మూడోసారి మాత్రమే 5 పరుగుల జరిమానా విధిస్తారు. ఇదిలా ఉండగా, 2023 డిసెంబర్‌ నుంచి స్టాప్‌ క్లాక్‌ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ సమయంలో ఏ జట్టు సైతం పెనాల్టీకి గురి కాలేదు. ఈ విషయం సీఈసీకి సమర్పించిన నివేదికలో పొందుపరిచారు.
మూడు నిబంధనలు!
అంతర్జాతీయ వైట్‌బాల్‌ క్రికెట్‌లో సమయ పాలన కోసం ఐసీసీ ఇప్పటికే రెండు కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా, ఇప్పుడు మూడోదీ తీసుకొచ్చింది. మెరుగైన ఓవర్‌రేట్‌ లక్ష్యం కోసం గతంలో తీసుకొచ్చిన రెండు నిబంధనలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు!. నిర్దేశిత సమయంలోపు నిర్ణీత ఓవర్లను పూర్తి చేయకుంటే.. ఆ సమయం పూర్తయిన తర్వాత మిగిలిన ఓవర్లకు 30 గజాల సర్కిల్‌ ఆవల ఓ ఫీల్డర్‌ను సర్కిల్‌ లోపలకు తీసుకురావాల్సి ఉంటుంది. డెత్‌ ఓవర్లలో ఫీల్డింగ్‌ జట్టు సర్కిల్‌ బయట నలుగురు ఫీల్డర్లను మాత్రమే నిలుపుకోవాల్సి ఉంటుంది. ఇక ఓవర్‌రేట్‌కు మ్యాచ్‌ ఫీజులో జరిమానా సైతం అమల్లో ఉంది. ప్రతి ఆలస్యమైన ఓవర్‌కు మ్యాచ్‌ ఫీజులో 5 శాతం కోత పడుతుంది. మ్యాచ్‌ ఫీజులో కొత గరిష్టంగా 50 శాతం వరకు ఉంటుంది. ఆటగాళ్లతో పోల్చితే కెప్టెన్‌కు రెట్టింపు మ్యాచ్‌ ఫీజు కోత విధిస్తారు.
ఇక కనీసం 10 ఓవర్లు
ఐసీసీ సీఈసీ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్‌ మ్యాచుల్లో ఫలితం తేలేందుకు కనీసం ప్రతి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల ఆట సాగాలని తేల్చింది. ప్రస్తుతం ఏదేని కారణంగా మ్యాచ్‌ కుదించబడితే.. 5 ఓవర్ల మ్యాచ్‌కు అవకాశం ఉంటుంది. కానీ ఇక నుంచి 5 ఓవర్ల ఆట కుదరదు. క్వార్టర్‌ఫైనల్‌, సెమీఫైనల్‌ సహా ఫైనల్లో కనీసం 10 ఓవర్ల ఆట సాధ్యపడితేనే ఫలితం తేలుతుంది. గ్రూప్‌ దశ మ్యాచులకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. గతంలో మాదిరిగానే 5 ఓవర్ల ఆటతో ఫలితాన్ని తేల్చవచ్చు. ప్రపంచకప్‌లో ఫైనల్‌తో పాటు సెమీఫైనల్స్‌కు సైతం రిజర్వ్‌ డే కేటాయించారు.
2026కు అర్హత ఇక్కడ్నుంచే
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌ అర్హత ప్రక్రియ 2024 టీ20 వరల్డ్‌కప్‌లోనే మొదలవుతుందని ఐసీసీ సీఈసీ ప్రకటించింది. 2026 ప్రపంచకప్‌లోనూ 20 జట్లు పోటీపడుతుండగా.. 12 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య దేశాలు భారత్‌, శ్రీలంక సహా 2024 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌8 దశకు చేరుకున్న జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో నిలిచిన రెండు/నాలుగు జట్లు సైతం అర్హత సాధిస్తాయి. మిగతా జట్లు రీజినల్‌, కాంటినెంటల్‌ అర్హత టోర్నీల నుంచి ప్రపంచకప్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.