కక్ష సాధింపు చర్యలు ఆపండి

– హర్యానా ప్రభుత్వానికి విద్యావేత్తల డిమాండ్‌
– మహిళా ప్రొఫెసర్‌కు సంఘీభావం
న్యూఢిల్లీ : దుండగుల ట్రోలింగ్‌, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌తో మానసిక క్షోభను అనుభవిస్తున్న జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సమీనా దల్వారుకు ఐదు వందల మందికి పైగా విద్యావేత్తలు సంఘీభావం ప్రకటించారు. మీ వెనుక మేమున్నామంటూ మద్దతు తెలిపారు. దల్వారుకి వ్యతిరేకంగా ఇటీవల ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగింది. ఆమెను లక్ష్యంగా చేసుకొని దారుణంగా ట్రోలింగ్‌ చేశారు. ఏ తప్పూ చేయకపోయినా ప్రొఫెసర్‌పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. దల్వారు తన తరగతి గదిలో డేటింగ్‌ యాప్‌ ‘బంబుల్‌’ను బోధనా సాధనంగా ఉపయోగించడమే ఆమె చేసిన నేరం. దీనిపై విద్యార్థులు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినప్పటికీ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. దల్వారుపై విషం చిమ్మేందుకు ఆమె మైనారిటీ గుర్తింపు, రాజకీయ విశ్వాసాలపై దాడి చేశారు. తరగతి గదిలో లైంగికత్వం, రాజకీయాలపై చర్చించడం మహిళల గౌరవానికి భంగకరంగా, విద్యార్థులపై వివక్ష చూపినట్లుగా భావించరాదని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రామచంద్ర గుహ, నందితా నారాయణ్‌, అచిన్‌ వనైక్‌, నందినీ సుందర్‌, తనికా సర్కార్‌, హర్బన్స్‌ ముఖియా తదితర విద్యావేత్తలు ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది వారాలుగా సమీనా దల్వారు ఎదుర్కొంటున్న అగ్ని పరీక్షపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్య స్ఫూర్తికి విద్య కీలకమైనది. భారతీయ విశ్వవిద్యాలయాలపై జరుగుతున్న దాడుల పర్వంలో ప్రొఫెసర్‌ సమీనా దల్వారుపై జరిగినది తాజా దాడి. నవంబర్‌ 7న పాలస్తీనా అంశంపై యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఈ-మెయిల్‌లో అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఇది ట్రోల్‌ చేసే వారికి లీక్‌ అయింది. దీంతో వారంతా దల్వారుపై హిందూ ఫోబియా కలిగిన వ్యక్తిగా ముద్ర వేశారు. పది రోజుల తర్వాత దల్వారు తరగతిలో బోధిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఆమె డేటింగ్‌ యాప్‌ బబుల్‌పై విద్యార్థులతో చర్చించారు. అయితే అది ఓ బోధనాంశం. న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్న మూడో సంవత్సరం విద్యార్థులకు ఆమె బోధిస్తున్నారు. ఆ సందర్భంగా డేటింగ్‌ యాప్‌ను ఓ బోధనా సాధనంగా ఆమె ఉపయోగించారు. కొందరు దుండగులు తరగతి గదిలో దీనిని రికార్డు చేసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేశారు. దీనిపై హర్యానా మహిళా కమిషన్‌ దర్యాప్తు జరిపింది. దల్వారు తప్పు చేశారని తేల్చింది. జరిగిన ఉదంతంపై వివరణ ఇచ్చే అవకాశం కూడా లేకుండా ఆమెకు యూనివర్సిటీ అధికారులు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత హెచ్చరిక జారీ చేశారు. రాజకీయ ఒత్తిడులే దీనికి కారణం’ అని విద్యావేత్తలు ఆ ప్రకటనలో వివరించారు. దల్వారుపై కక్ష సాధింపు చర్యలకు వెంటనే స్వస్తి చెప్పాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.