రేవంత్‌… బీజేపీని అడ్డుకో

ొ మా కృషికి మీరు తోడుకావాలి ొ కేరళలో కాంగ్రెస్సే సీపీఐ(ఎం)కు ప్రధాన ప్రతిపక్షం... కానీ బీజేపీని మేం అడుగు పెట్టనివ్వలేదు ొ పార్లమెంటు ఎన్నికల్లో సీపీఐ(ఎం)ను ఆదరించాలి- దేశంలో వామపక్షాల బలం పెరగాలి ొ బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలి- ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ొ ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి హాని కలిగిస్తున్న కేంద్రం ొ పన్నుల్లో 50 శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయించాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ొ తెలుగులో ఎన్నికల ప్రణాళిక విడుదల– మా కృషికి మీరు తోడుకావాలి
– కేరళలో కాంగ్రెస్సే సీపీఐ(ఎం)కు ప్రధాన ప్రతిపక్షం… కానీ బీజేపీని మేం అడుగు పెట్టనివ్వలేదు
– పార్లమెంటు ఎన్నికల్లో సీపీఐ(ఎం)ను ఆదరించాలి- దేశంలో వామపక్షాల బలం పెరగాలి
– బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలి- ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం
– ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి హాని కలిగిస్తున్న కేంద్రం
– పన్నుల్లో 50 శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయించాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
– తెలుగులో ఎన్నికల ప్రణాళిక విడుదల
– తెలంగాణలో ఆ పార్టీ ఒక్క సీటు గెలవకుండా చూడు
– తెలుగులో ఎన్నికల ప్రణాళిక విడుదల 

ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను కాంగ్రెస్‌ కలుపుకుపోవాలి. కానీ ప్రధాన పార్టీగా కాంగ్రెస్‌ ఆ ప్రయత్నం చేయడం లేదు. కలిసొచ్చే పార్టీలతో సంప్రదింపులు ఆ పార్టీ బాధ్యత
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మా కృషికి మీరు తోడుకావాలి. కేరళలో కాంగ్రెస్సే సీపీఐ(ఎం)కు ప్రధాన ప్రతిపక్షం. అయినా మేం బీజేపీని అడుగు పెట్టనివ్వలేదు. పార్లమెంటు ఎన్నికల్లో సీపీఐ(ఎం)ను ఆదరించాలి. దేశంలో వామపక్షాల బలం పెరగాలి. బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలి. ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి కేంద్రం హాని కలిగిస్తోంది. పన్నుల్లో 50 శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయించాలి
– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘కేరళలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నా బీజేపీ రాకుండా ఆపగలిగాం. ఈసారి కూడా అదే జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అడుగు పెట్టడమే కాదు ఈసారి అధిక ఎంపీ స్థానాలు గెలవాలని వ్యూహాలు రచిస్తున్నట్టు మీడియాలో వస్తున్నది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రేవంత్‌రెడ్డి అక్కడికి వెళ్లి ఇండియా కూటమి పార్టీల గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీజేపీని అడ్డుకోవాలి. తెలంగాణలో బీజేపీకి ఒక్క స్థానం రాకుండా చూడాలి. అది ప్రజలకు, దేశానికి, లౌకికవాదానికి మంచిది. మా ఈ కర్తవ్యానికి కాంగ్రెస్‌ తోడుకావాలి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఆ పని మేం ఒక్కరమే చేయాల్సి వస్తున్నది. అలాంటి పరిస్థితి రాకుండా రేవంత్‌రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలి.’అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. రేవంత్‌రెడ్డి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో తెలుగులో అనువదించిన సీపీఐ(ఎం) ఎన్నికల ప్రణాళికను బివి రాఘవులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం)ను ఆదరించాలనీ, వామపక్షాల బలం పెంచాలని కోరారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి, ఐక్యతకు, అభివృద్ధికి ఆటంకమని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని ప్రతిఘటించాలనీ, నిరోధించాలని చెప్పారు. బీజేపీ పౌరసత్వ చట్టాన్ని సవరించిందనీ, అది లౌకికవాదానికి, మైనార్టీలకు హాని కలిగిస్తుందనీ, దాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని కాలరాస్తూ 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసిందన్నారు. కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిం చాలని కోరారు. నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాల హక్కులను, ఆర్థిక పరిస్థితిని బీజేపీ తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. దేశంలో వసూలయ్యే అన్ని రకాల పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు కేటాయించాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాలకు కేటాయించే నిధులు 30 శాతానికి పడిపోయాయని వివరించారు. విద్యాహక్కు ఎలాగో ఉపాధి హక్కు, ఆరోగ్య హక్కు కోసం చట్టాలు రావాలన్నారు. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కులగణన చేయాలని కోరారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. వాటి స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించాలని చెప్పారు.
మోడీ పాలనలో సామాన్యులకు ఒరిగిందేం లేదు
బీజేపీ సంకల్ప్‌ పత్ర్‌ పేరుతో మ్యానిఫెస్టోను ప్రకటించిందనీ, అందులో అన్నీ అబద్ధాలేననీ, మోసపూరితమైన వాగాడంబరాలున్నాయని రాఘవులు అన్నారు. పార్టీ మీద, ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా మోడీ గ్యారంటీ అంటూ ప్రచారం చేస్తున్నారని వివరించారు. పదేండ్లు ఏం గ్యారంటీ ఇచ్చారనీ, ఏం అభివృద్ధి చేశారని విమర్శించారు. ఈ పదేండ్ల అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమేననీ, అసలు సినిమా ముందుందని మోడీ అంటున్నారని గుర్తు చేశారు. ట్రైలరే ఇంత ముదనష్టంగా ఉంటే, సినిమా ఎంత రోతగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. నిరుద్యోగం, అసమానతలు పెరిగాయన్నారు. ఒక శాతం సంపన్నుల వద్ద 23 శాతం ఆదాయం, 40 శాతం సంపద కేంద్రీకృతమై ఉందన్నారు. మోడీ పాలనలో సంపన్నులు లబ్దిపొందారనీ, సామాన్యులకు ఏమీ ఒరగలేదని అన్నారు. ఇదేనా ట్రైలర్‌ అని ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి 2014లో మానవాభివృద్ధి సూచిలో భారత్‌ 130వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 139వ స్థానానికి దిగజారిందన్నారు. ప్రజలు ఆకలి, అసమానతలతో ఉంటే ప్రపంచం ఈర్ష్య పడేలా మోడీ అభివృద్ధి చేస్తున్నారంటూ బీజేపీ నేతలు చెప్తున్నారని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉన్నాం, మూడో స్థానానికి వెళ్తున్నామంటున్నారని గుర్తు చేశారు. భారత్‌లో తలసరి ఆదాయం రూ.2,600 ఉందనీ, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కడున్నామనీ, 120వ స్థానంలో ఉన్నామని వివరించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ప్రస్తావించారని చెప్పారు. అన్యాయాన్ని కప్పిపెట్టుకోవాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు.
బీజేపీ అణ్వాయుధ ప్రపంచాన్ని కోరుకుంటున్నదా?
అణ్వాయుధాలను రద్దు చేస్తామంటూ సీపీఐ(ఎం) మ్యానిఫెస్టోలో ప్రకటించిందనీ, అది దేశ భద్రతకు ప్రమాదమనీ, దేశద్రోహమని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించారని రాఘవులు గుర్తు చేశారు. తమ మ్యానిఫెస్టోను ఆయన సరిగ్గా చదివారో లేదోనని అన్నారు. తమ మీద గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో అణ్వాయుధా లుండొద్దని కోరుకుంటున్నామని చెప్పారు. దేశాలన్నీ ఒక అంగీకారానికి వచ్చి అణ్వాయుధాలను లేకుండా చేయాలన్నదే తమ అభిప్రాయమని అన్నారు. ఏదో ఒక దేశంలో అవి లేకుండా చేస్తే సరిపోదని చెప్పారు. అణ్వాయుధ రహిత ప్రపంచం కావాలంటున్నామని వివరించారు. అణ్వాయుధ ప్రపంచం కావాలని బీజేపీ, రాజ్‌నాథ్‌సింగ్‌ కోరుకుంటున్నారా?అని ప్రశ్నించారు. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య అణ్వాయుధాలు వినియోగించాలని కోరుకుంటున్నారా? అని నిలదీశారు. ఇది అత్యంత ప్రమాదకర యుద్ధోన్మాద వైఖరి తప్ప మరొకటి కాదన్నారు. సీపీఐ(ఎం) వైఖరిని వక్రీకరిస్తున్నారని చెప్పారు. సీపీఐ(ఎం)ను ఆదరించాలనీ, వామపక్షాల బలం పెంచుకోవాలని అన్నారు. ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలు బలపర్చడానికి ముందుకు రావాలని కోరారు.
నేడు భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ నామినేషన్‌
– రైల్వే స్టేషన్‌ నుంచి ఏఆర్‌ గార్డెన్‌ వరకు భారీ ర్యాలీ, సభ
– అంబేద్కర్‌ చౌరస్తా వద్ద రోడ్‌ షో
– హాజరుకానున్న బీవీ రాఘవులు, తమ్మినేని
– ప్రజలు,పార్టీ శ్రేణులు భారీగా తరలిరండి : చెరుపల్లి సీతారాములు
– నేడు జహంగీర్‌ నామినేషన్‌ : ఎస్‌ వీరయ్య
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య చెప్పారు. అనంతరం ప్రదర్శన, బహిరంగ సభ ఉంటాయనీ, ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి పాల్గొంటారని వివరించారు.
ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్‌ సంప్రదించడం లేదు : తమ్మినేని
ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోయే పని ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కానీ కాంగ్రెస్‌ అలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. కలిసొచ్చే పార్టీలతో సంప్రదించే పని చేయడంలేదని అన్నారు. రెండు, మూడు రోజుల్లో సీఎం లేదంటే ఆయన తరఫున ప్రతినిధి సంప్రదింపులకు వస్తారంటూ తెలిసిందన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానంలో సీపీఐ(ఎం) పోటీ చేస్తున్నదని వివరించారు. తమ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ బాల్యం నుంచి కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారనీ, ప్రజాజీవితంలో ఆదర్శంగా ఉన్నారని చెప్పారు. ఆయనకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందన్నారు. మిగతా 16 స్థానాల్లో ఇండియా కూటమిలో ఉన్నందున కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు. పార్టీ అఖిల భారత రాజకీయ విధానానికి అనుగుణంగా తమ నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఎవరికి మద్దతివ్వాలో కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఇవి సాదాసీదా ఎన్నికలు కాబోవని అన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని విమర్శించారు. ఇది దేశ భవిష్యత్తుకు ఐక్యతకు ప్రమాదమని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాలన్నారు. భువనగిరిలో ప్రజాతంత్ర శక్తులు, లౌకికశక్తులు సీపీఐ(ఎం)కు ఓటేయాలని కోరారు.