దాడులు ఆపండి

దాడులు ఆపండి– తెలంగాణ రాష్ట్ర ఆర్‌ఎంపీ, పీఎంపీ, సీపీఈపీ సంఘాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామాల్లో ప్రాథమిక సేవలందిస్తున్న తమపై వైద్యారోగ్యశాఖ, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడులు చేయకుండా నిలువరించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్‌ఎంపీ, పీఎంపీ, సీపీఈపీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ఆ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ వెంకట్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారు పట్టణాలు, నగరాలు వెళ్లేంత వరకు ప్రాథమిక చికిత్స అందించేది తామేనని తెలిపారు. అలాంటి తమపై రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు తమకు అండగా ఉంటామని ఆ పార్టీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పేదలకు అండగా ఉంటున్న తమ ఆత్మస్థైర్యాన్ని దాడులతో దెబ్బతీయకుండా చూడాలని కోరారు. అదే విధంగా ప్రతి ఆర్‌ఎంపీ, పీఎంపీలు ప్రాథమిక వైద్యానికే తమ సేవలను పరిమితం చేయాలని సూచించారు.