పాలస్తీనాపై దాడులు ఆపాలి

నవతెలంగాణ-సంగారెడ్డి, పటాన్‌చెరు
అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి పశ్చిమ దేశాల అండతో అక్టోబర్‌ 7 నుంచి పాలస్తీనపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధకాండను, అమానుష దాడులను తక్షణం ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ నాయకులు శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవన్‌ నుంచి కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని పలు పరిశ్రమల ఎదుట ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.మల్లేశం, సాయిలు.. పటాన్‌చెరులో సీఐటీయూ జిల్లా కోశాధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. గత 20 రోజులుగా పాలస్తీనాపై గాజాను కేంద్రంగా చేసుకొని ఇజ్రాయిల్‌ భీకర వైమానిక దాడులతో యుద్ధకాండను కొనసాగిస్తున్నదన్నారు. ఇజ్రాయిల్‌ అమానుష దాడుల్లో 2వేల మందికి పైగా చిన్నారులతో సహా సుమారు 6 వేల మంది మత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 10 లక్షల మంది శరణార్థులుగా మారారన్నారు. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యా యన్నారు. చిన్నారులు, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు గాజా ఆస్పత్రులకు జనరేటర్లకు కావాల్సిన ఇంధనాన్ని కూడా సరఫరా కాకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. గాజాకు మానవతా సహాయం అత్యవసరంగా అవసరమున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఐ) సైతం అంతర్జాతీయ సమాజానికి చేసిన విజ్ఞప్తి.. అక్కడి తీవ్రతను వెల్లడిస్తున్నదన్నారు. ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాద వైఖరిని ప్రపంచ హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సంస్థ కూడా తీవ్రంగా విమర్శించిందన్నారు. ఇప్పటికైనా ప్రపంచ వ్యాప్తంగా శాంతికాముకులు కోరుతున్న విధంగా పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆపాలన్నారు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో బాధిత పాలస్తీనా ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర కార్మికవర్గం యావత్తూ సంఘీభావం తెలుపుతున్నదన్నారు. ఈ కార్యక్రమాల్లో సంగారెడ్డిలో సీఐటీయూ నాయకులు యాదగిరి, అశోక్‌, మహేష్‌, దత్తు, లక్కం, దుర్గయ్య, మహేష్‌, రమాదేవి, లక్ష్మీ, శారద, రాజు, పటాన్‌చెరులో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి, మనోహర్‌, శాంత కుమార్‌, యాదయ్య, రోషన్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ యుద్ధం నిలిపివేయాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.మల్లికార్జున్‌
నవతెలంగాణ – మెదక్‌
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.మల్లికార్జున్‌ పేర్కొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం మెదక్‌ జిల్లా ప్రజా సంఘాల కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య 942 నుంచి మూడు వర్గాల ప్రజల మధ్య సరిహద్దులు, వారి ప్రార్థన మందిరాలు, మసీదులు, భూభాగంలో ఉన్న ఇతర సమస్యలపై ఒకరిపై ఒకరు దాడులు చేస్తుండటంతో వేల మంది మృతి చెందారన్నారు. పాలస్తీనాపై అమెరికా లాంటి దేశాల సూచనలతో ఇజ్రాయిల్‌ దాడులు చేయడం తగదన్నారు. సహాయక చర్యలను ఇజ్రాయిల్‌ అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఉగ్రవాద సంస్థలకు ఒక దేశపు భద్రతా దళాలకు తేడా ఏంటని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజు, ఉపాధ్యక్షులు మల్లేశం, నర్సమ్మ, బాలమని, కడారి నాగరాజు, నాయకులు తదితరులు ఉన్నారు.