– హైకోర్టులో అత్యవసర విచారణ
– జస్టిస్ వినోద్ కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలకు శ్రీకారం చుట్టిన హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు శనివారం అత్యవసరంగా విచారించింది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చర్యలను సవాల్ చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్ నల్లా ప్రీతమ్‌రెడ్డి హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్ శనివారం ఆ పిటిషన్‌ను విచారించారు. కూల్చివేత చర్యలపై స్టేటస్‌కో (యథాతథస్థితి) ఆర్డర్‌ను జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులను జారీ చేసే వరకు యథాతథస్థితిని కొనసాగించాలంటూ హైడ్రాను, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ కన్వెన్షన్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు లాయర్ చేసిన వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ప్రస్తుతం స్టేటస్‌కో ఆర్డర్ ఇస్తున్నామనీ, పూర్తి స్థాయిలో విచారణ జరిగాకే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, హైడ్రా కమిషనర్ తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
‘అక్కినేని నాగార్జున పట్టా భూమిని కొనుగోలు చేసిననాటి సర్వే ప్రకారం ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారు. ఇది 2010-12 మధ్య కాలంలో పూర్తయింది. అయితే, ఎన్ కన్వెన్షన్ ఉన్న భూమి తుమ్మడికుంట చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందంటూ గత కేసీఆర్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ముందుగా ఆ కన్వెన్షన్ బాధ్యులకు నోటీసు ఇచ్చి, ఆ తర్వాత వారి వాదన వినిపించుకునే అవకాశం కూడా అధికారులు ఇవ్వలేదు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. రంగారెడ్డి శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నెం.201/1, 11/2, 11/3, 11/36లోని 27063 చదరపు మీటర్ల స్థలంలో ఎన్ కన్వెన్షన్ ఉంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో అధికారులు కూల్చివేత చర్యలు ప్రారంభించారు. హైడ్రా చేపట్టిన ఈ ఆకస్మిక చర్య చట్ట వ్యతిరేకం. పిటిషనర్‌కు అక్కడ 6.30 ఎకరాల రిజిస్ట్రర్ భూమి ఉంది. సేల్ డీడ్‌ల ద్వారా దాన్ని 1992లో కొనుగోలు చేశారు. ఇది పట్టా భూమి. రెవెన్యూ రికార్డుల్లో అక్కినేని నాగార్జున పేరు మీద మ్యుటేషన్ అయ్యింది. అక్కడి చెరువు భూమిని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు.
భూమి తమ్మిడికుంట ట్యాంక్‌కు ఆనుకుని ఉంది, ఇది సర్వే నెం.36లో ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ చెరువు పరిధి 20 ఎకరాల 07 గుంటలు. బిల్డింగ్ బైలాస్/జోనల్ నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్ పరిధి 9 మీటర్లు మాత్రమే. అయితే, ప్రయివేటు సర్వే నివేదిక ఆధారంగా తమ్మిడికుంట చెరువు విస్తీర్ణాన్ని 29 ఎకరాలుగా పేర్కొంటూ గత ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చింది. దీంతో ఎఫ్‌టీఎల్ పరిధి 30 మీటర్లకు పెరిగింది. తమ్మడికుంట ట్యాంక్ 20.07 కరాలా? లేక 29 ఎకరాలా? అనే వివాదం కొలిక్కిరాలేదు. దీనిపై సివిల్ కోర్టులో 2017 నుంచి వివాదం పెండింగ్‌లో ఉంది. తమ్మిడికుంట ట్యాంక్ విస్తీర్ణం 20.07 ఎకరాలేనంటూ కలెక్టర్, హెచ్‌ఎండీఏ ఇచ్చిన నివేదిక ప్రకారం భూసేకరణ కోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. ఎన్ కన్వెన్షన్ భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలనే (బిఆర్‌ఎస్) అప్లికేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీనిపై ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే స్టేటస్‌కో ఆర్డర్ 2021లో ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇప్పటికీ అమల్లో ఉంది. అయినా మళ్లీ ప్రభుత్వం కూల్చివేత చర్యలకు శ్రీకారం చుట్టింది. అయ్యప్ప సొసైటీ వ్యాజ్యంలో భాగమైన సర్వే నెం.11కి సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆ కోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ కూడా అయ్యప్ప సొసైటీ పరిధిలోనే ఉంది…’ అని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు.. నోటీసు ఇచ్చిన వెంటనే కూల్చివేత చర్యలను ఎలా ప్రారంభి స్తారంటూ హైడ్రా అధికారులను ప్రశ్నించింది. నోటీసుకు వివరణ ఇచ్చే గడువు ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు నిలిపివేస్తూ మధ్యంతర స్టేటస్‌కో ఆర్డర్ జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.