high_court- ఖాజాగూడలో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
– ఆ నిర్మాణాలు చట్టవిరుద్ధమని ఆధారాలేవి?
– ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నట్టు మీరెలా నిర్ధారిస్తారు?
– ఇలాంటి చర్యలు మళ్లీ జరిగితే రంగనాథ్‌పై కఠిన చర్యలు : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘ఆ నిర్మాణాలు చట్టవిరుద్ధమని ఆధారాలేవి? ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఆ నిర్మాణాలున్నాయని మీరెలా నిర్ధారిస్తారు? ఇలాంటి చర్యలు మళ్లీ జరిగితే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హైకోర్టు హెచ్చరించింది. ఖాజాగూడ సరస్సు వద్ద హైడ్రా కూల్చివేతలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఖాజాగూడ సరస్సు ప్రాంతంలో ఇటీవల హైడ్రా సంస్థ చేపట్టిన కూల్చివేత చర్య చట్టబద్ధతను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేసింది. ఎఫ్‌టీఎల్(ఫ్లడెడ్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్‌లోని ఆస్తులపై కూల్చివేతపై సాక్ష్యాలేని ప్రశ్నించింది. ”ఈ ఆస్తులు ఎటువంటి ఆధారాలు అందించకుండా ఎఫ్‌టీఎల్ సరిహద్దులో ఉన్నాయని మీరు ఎలా క్లెయిమ్ చేస్తారు?” అని నిలదీసింది. కూల్చివేతలకు సంబంధించిన చట్టపరమైన ప్రాతిపదికపై సందేహాలను లేవనెత్తుతూ పిటిషనర్ అవసరమైన అన్ని పత్రాలను సమర్పించారని తెలిపింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిమితుల యొక్క సరైన ధ్రువీకరణ లేకుండా కూల్చివేతలను అమలు చేయడాన్ని తప్పుబట్టింది. కూల్చివేతలను నిలిపివేయాలని కమిషనర్‌ను ఆదేశించింది. ”మరోవిధంగా ఆదేశాలున్నప్పటికీ కూల్చివేతలు కొనసాగితే, నేను తదనుగుణంగా చర్యలు తీసుకుంటాను. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కమిషనర్ రంగనాథ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జస్టిస్ లక్ష్మణ్ హెచ్చరించారు. పిటిషనర్ జీహెచ్‌ఎంసీ నిబంధనలను అనుసరించి అధికారిక అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలను 24 గంటల్లోగా తొలగించాలని కూడా జస్టిస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.