రెండు సంవత్సరాల క్రితం తెలుగు ఉపాధ్యాయులుగా పదవి విరమణ చేసి విశాఖ ఆనందపురంలో స్థిరపడిన మిత్రుడు రఘురాంను కలవడానికి విజయేంద్ర ఆనందపురం కూడలిలో దిగి ఆటో వాడికి ఆ చిరునామా దగ్గర దింపమన్నారు. ఆటో వాడు ఆనందపురం గ్రామంలోకి తెచ్చి విజయేంద్రను దింపాడు. అక్కడే ఒక దుకాణం దగ్గర రఘురాం చిరునామా అడిగారు.
”అదిగో ఎదురు సందులోకి వెళ్ళండి” అని దుకాణం వాడు చెప్పాడు. ఎదురు సందులోకి విజయేంద్ర నడుచుకుంటూ వెళ్లి అక్కడ కనబడిన ఒక వ్యక్తిని ”ఇక్కడ రఘురాం గారి ఇల్లు ఎక్కడ” అని అడిగారు.
ఆ వ్యక్తి రఘురాం ఎవరా అని ఆలోచించి ”ఓ… కథల తాతయ్య రఘురాం గారా! రండి నేను తీసుకు వెళ్తా” అని అక్కడికి కాస్త దూరంలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి ”ఇదే రఘురాం గారి ఇల్లు” అని చెప్పి వెళ్ళిపోయాడు. గేటు ముందర ”కథలు చెప్పబడును” అనే బోర్డు వేలాడదీసి ఉంది. విజయేంద్ర బోర్డు చదివి ”అందుకే కథల తాతయ్య అని అన్నారు” అని అనుకున్నారు.
గేటు తీసి లోపలికి అడుగు పెట్టిన విజయేంద్రకు ఎదురుగా చెట్టునీడలో రఘురాం గారి చుట్టూ 20 మంది వరకు పిల్లలు కూర్చుని కనిపించారు. రఘురాం వారికి ఏదో చెప్తున్నారు. రఘురాం గారు గేట్ శబ్దం విని గేటు వైపు చూశారు. మిత్రుడు విజయేంద్ర తన వైపు రావడం చూసి రఘురాం ఎదురుగా వెళ్లారు.
”విజయేంద్ర! బాగున్నావా! అందరూ క్షేమమే కదా!” కుశల ప్రశ్నలు వేసి వరండాలో ఉన్న కుర్చీలలో ఇద్దరు కూర్చున్నారు. రఘురాం తన భార్య వరలక్ష్మిని కేక వేసి ”విజయేంద్ర వచ్చాడు” అని చెప్పాడు.
వరలక్ష్మి బయటకు వచ్చి ”అన్నయ్య బాగున్నారా!, వదినా పిల్లలు బాగున్నారా!” అని క్షేమ సమాచారాలు అడిగి కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది.
విజయేంద్ర చెట్టు దగ్గర కూర్చున్న పిల్లల వైపే చూస్తున్నారు. వాళ్లు చక్కగా కూర్చుని ఉన్నారు. ఒక పెద్దబ్బాయి కథల పుస్తకంలో కథ చదువుతుంటే మిగిలిన అందరూ శ్రద్ధగా వింటున్నారు.
విజయేంద్ర, రఘురాంతో ”పదవీ విరమణ తర్వాత హాయిగా ఉండకుండా ఇదేమిటిరా ఇలా పిల్లలకు కథలు చెబుతున్నావు” అని అడిగాడు.
రఘురాం నవ్వుతూ ”నేటి ఇంటర్నెట్ యుగంలో ఇళ్ల దగ్గర తల్లిదండ్రులు, నాన్నమ్మ తాతయ్యలు చరవాణి లోనే తమ కాలం గడిపేస్తున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలు మార్కుల ప్రపంచంలో పోటీ చదువులతో ఒత్తిడికి గురవుతున్నారు. వారి ఒత్తిడిని తగ్గించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవటం లేదు. చిన్నచిన్న నీతి కథల ద్వారా వారి ఒత్తిడిని తగ్గించే ఆలోచన, తీరిక పెద్దలకు లేదు. అందుకే నేటి పిల్లల మానసిక వికాసానికి నా వంతుగా వారిలో ఆనందం, కల్పనాశక్తి పెంపొందించేందుకు అందుబాటులో ఉన్న పిల్లలకు కథలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాను” అని రఘురాం మిత్రుడితో అన్నారు.
విజయేంద్ర ”ప్రారంభం నుంచి ఇంతమంది పిల్లలు వస్తున్నారా!” అని అడిగారు.
”నాకు పిల్లలకు కథలు చెప్పాలనే ఆలోచన వచ్చినప్పుడు ‘కథలు చెప్పబడును’ అనే బోర్డు పెడితే కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే వచ్చారు. వాళ్లకు కథల పట్ల ఆసక్తి కలిగి వారు ప్రతిరోజు వచ్చే విధంగా వారికి ఒక వారం వరకు కథలు చెబుతూ ప్రతిరోజు మిఠాయి ఇచ్చి ఇంటికి పంపేవాడిని. వారి తోటి పిల్లలకి ఆ విషయం చెప్పడంతో మిఠాయిల కోసమైనా కొద్దిమంది పిల్లలు రావడం మొదలుపెట్టారు. వాళ్లకు కూడా ప్రతిరోజు మిఠాయిలు ఇస్తూ కథలు చెప్పేవాడిని. వాళ్లకు కథల పట్ల ఆసక్తి కలిగి రోజూ రావడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పుడు ఈ వీధిలో ఉన్న 20 మంది పిల్లల వరకు వస్తున్నారు. అప్పుడప్పుడు పిల్లలే నిలబడి కథలు చెబితే వారికి బహుమానాలు ఇవ్వడం చేస్తుంటాను. ఇప్పుడు చాలామంది పిల్లలు ఆసక్తిగా వస్తున్నారు. నా ఖాళీ సమయం ఇలా పిల్లలతో కథలు చెబుతూ గడిపేస్తున్నాను” అని చెప్పారు.
విజయేంద్ర రఘురాంను మెచ్చుకుంటూ ”చాలా చక్కటి ఆలోచన నీది. నేటి పిల్లలకు బాల సాహిత్యం ద్వారా విలువలు నేర్పడం బాగుంది. ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర లేకపోయినా, వాళ్ళు చక్కని క్రమశిక్షణతో ఆ పెద్ద అబ్బాయి చెబుతున్న కథ వింటున్నారు. నేటి తరానికి నేర్పవలసినది చక్కని క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవనం, ఒత్తిడిని దూరం చేసుకోవడం. అవన్నీ నువ్వు వారిలో కలిగిస్తున్నావు. అంతకుమించిన ఆనందం ఏముంది. నేను కూడా మా గ్రామంలో ఉన్న పిల్లలకు నాకు తెలిసిన కథలు చెబుతాను” అని ఆనందంగా అన్నారు. ఇంతలో వరలక్ష్మి వేడివేడి పకోడీలు, చక్కని కాఫీ కలిపి ఇద్దరికీ ఇచ్చింది. కాఫీ తాగుతూ ఇద్దరు మాట్లాడుకున్నారు.
– మొర్రి గోపి