విలువలు నేర్పే కథలు

Stories that teach valuesపిల్లలకు కథలు అంటే ఎంతో ఇష్టం. కథల ద్వారా నైతిక విలువలు నేర్చుకోవచ్చు. మనలో సజనాత్మకత వెలికి తీయవచ్చు. పిల్లల కోసం పెద్దవాళ్లు కథలు రాస్తుంటారు కానీ పిల్లల కోసం పిల్లలే కథలు రాస్తే అవి మరింత ఆసక్తికరంగా ఉంటాయి. అట్లా రాసిన కథలే ‘జర్నీ’.
వట్టిమర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల యాత్ర నేపథ్య కథలు జర్నీ. కథలన్నీ చాలా బాగున్నాయి. నేను కథ రాయలేదు అంటూ జాలనందిని రాసిన కథ పెద్దయిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. 60 ఏండ్ల కిందట విహారయాత్రకు పోయిన తాత, ఆనాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషం వ్యక్తం చేయడం ఈ కథలో కనిపిస్తుంది.
తొమ్మిదవ తరగతి చదివే బొబ్బలి జ్యోతి ‘మహేష్‌ లేరా’ అనే కథ రాసింది. తాను టూర్‌ వెళ్తున్నట్టు కలగంటూ మహేష్‌ యాత్రా విశేషాలు ఊహించుకోవడం ఈ కథలో కనిపిస్తుంది.
దార శివ రేణుక తమ్ముని కోసం అనే కథ రాసింది. తన తమ్ముని కోసం బొమ్మను దొంగిలించిన అన్న గురించి రాసింది. కథ చివరలో దొంగతనాలు చేయడం తప్పు అని తెలియజెప్పింది. తమ్ముడు పై ప్రేమను ఈ కథలో చూపించారు.
పల్లపురిషిత రాసిన కథ హలో అమ్మ… తప్పిపోయిన తన తమ్ముడు జాతరలో కనిపించినప్పుడు సహస్ర అనే అమ్మాయి పొందిన సంతోషం ఈ కథలో కనిపిస్తుంది. తాను పొందిన బహుమతి డబ్బుతో తన చెల్లెను టూర్కు పంపించిన కథ నూనె నందిని రాసిన త్యాగమయి. ఈ కథ ద్వారా అక్కాచెల్లెళ్లు ఒకరికొకరు సహాయ సహకారాలు త్యాగబుద్ధితో ఉండాలని తెలిపింది. వెన్నపూసల భవ్య రాసిన కథ కొత్త వెలుగులు. ఈ కథలో మన ఇంట్లో ఉండే తాత నాయనమ్మ మొదలైన ముసలివాళ్లను ప్రేమగా చూసుకోవాలని చెప్పింది.
నర్రా మణిధర్‌ రెడ్డి అయ్యో సిరి అనే కథ రాశాడు. టూర్కు వెళ్లినప్పుడు తన స్నేహితురాలికి ముల్లు గుచ్చుకుంటే సహాయం చేసిన తన్మయి గురించి ఈ కథలో చెప్పారు. చిన్న చిన్న గొడవలు ఉన్నా స్నేహం విడిచి పెట్టొద్దు అనేది ఈ కథ చెప్పిన నీతి. బాతుక చందన రాసిన పట్టుదల కథలో జాతరలో గుడి వద్ద కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయి కష్టపడి చదివి డాక్టర్‌ అయినట్లుగా రాసింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ కథ చెబుతుంది. విహారయాత్రలో గాయపడిన కోతిని చూసి మానవత్వంతో స్పందించి వైద్యం చేయించినట్లుగా దేశ గాని మహేశ్వరి కుట్టి కథలో రాసింది.
బెల్లపు ప్రవల్లిక రాసిన మూగ పిల్లవాడు కథలో తనకు దొరికిన బంగారు గొలుసును నిజాయితీగా అందజేయడానికి ప్రయత్నించిన పిల్లవాడిని అపార్థం చేసుకునే కథ. ఎవరిని తొందరగా అపార్థం చేసుకోవద్దని ఓపిక అవసరం అని ఈ కథ తెలుపుతుంది. నిజాయితీగా జీవించాలని కూడా ఈ కథ చెప్తుంది.
దేశ గాని రాకేష్‌ క్షమించండి సార్‌ అనే కథ రాశాడు. రాము వేణు అనే విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా ఉండడం వల్ల జరిగే నష్టాన్ని ఈ కథ చెప్పింది. చెప్పిన మాటలు వినాలి. లేకపోతే తీరా ఇబ్బంది కలిగినప్పుడు బాధపడితే లాభం ఉండదు. ఎవరైనా మనకు మంచి చెబితే తప్పక వినాలి అని ఈ కథ సందేశం ఇస్తుంది.
కొమర్రాజు ప్రఖ్యాత్‌ ముడుపులు అనే కథ రాశాడు. సీత విహారయాత్రకు వెళితే తప్పిపోయిన వాళ్ళ అన్న దొరకడం ఈ కథలో కనిపిస్తుంది. ముఖ్యంగా స్నేహితుల వల్లనే వాళ్ళ అన్న దొరికాడని సీత ఎంతో సంతోషిస్తుంది. మంచి స్నేహితులు ఎంతో అవసరమని ఈ కథ తెలియజేస్తుంది.
ఉప్పునూతల రిషి రాసిన చేసిన మేలు కథలో రాజు విజరుల స్నేహం ఎంతో నచ్చింది. విజరు రాజు కు చేసిన మేలుకు ప్రతిఫలంగా రాజు విజరు కి కూడా మేలు చేశాడు. స్నేహం అంటే ఒకరికి ఒకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉండడం అని ఈ కథ ద్వారా తెలుస్తుంది.
ముకుందా పరమేశ్వరి రాసిన కథ పేరు జర్నీ. తల్లిదండ్రులతో కలిసి యాత్రకు వెళ్లడం కంటే స్నేహితులతో కలిసి వెళ్లడం వల్ల ఎక్కువ విషయాలు ఎక్కువ ఆనందం పొందుతామని ఈ కథ తెలుపుతుంది.
సాదం సాయికుమార్‌ రాసిన కథ పేరు ‘రాకేష్‌ వాళ్ళ నాన్న ‘ విహారయాత్రకు పోయి మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల సెల్‌ ఫోన్‌ చూడడం తగ్గించారని, మంచి స్నేహితులతో స్నేహం చేసి బుద్ధిమంతుడు అయ్యాడని రాకేష్‌ లో వచ్చిన మార్పును చక్కగా వివరించాడు.
సిరిపంగి జ్ఞానేశ్వరి మేడి రిషిత ఇద్దరు కలిసి రాసిన కథ ఇద్దరు స్నేహితులు. ఊరు విడిచి వెళ్లిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలు టూర్‌ వెళ్ళినప్పుడు అనుకోకుండా కలిస్తే ఎంత సంతోషం ఉంటుందో ఈ కథ చెప్పింది.
వెన్నపూసల హర్షిత రాసిన కథ శభాష్‌ పిల్లలు. చాలామంది డబ్బు దొరికితే లెక్కలేని ఖర్చు పెడతారు. కానీ రమేష్‌, మధు మాత్రం తమకు దొరికిన డబ్బు అనాధాశ్రమానికి ఇవ్వాలనుకున్నారు. చిన్న వయసులో పెద్ద మనసును చాటుకున్న పిల్లల కథ ఇది.
కుంచపు కావ్య రాసిన కథ మొక్కులు. వందల కొద్ది భక్తులు గుడికి ఎందుకు వస్తున్నారు అని ఆలోచించిన పిల్లల కథ ఇది. తమ కోరికలను తీర్చుకోవడానికి మొక్కులు చెల్లించడానికి వస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఏ విషయాన్ని అయినా జాగ్రత్తగా పరిశీలించడం అవసరం అని ఈ కథ ద్వారా తెలుస్తుంది.
జాల నవ్యశ్రీ రాసిన కథ ఓదార్పు. ఆపదలో ఉన్న స్నేహితులకు ఓదార్పు ఇవ్వాలి అని ఈ కథలో తెలియజేస్తుంది.
ఈ పుస్తకంలోని కథలన్నీ అనేక విలువలను నేర్చుకోవడానికి ఉపయోగ పడతాయి. విహారయాత్రకు వెళ్లినప్పుడు చూసిన విషయాలు కూడా కథల రూపంలో రాయవచ్చని ఈ కథలు తెలియజేశాయి. ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఈ పుస్తకం ఉండాలి. ఈ కథలు చదవడం ద్వారా చదువుపై ఆసక్తి పెరుగుతుంది. సెల్‌ ఫోన్‌ చూడడం తగ్గిపోతుంది. క్రమశిక్షణ అలవర్చుకోవచ్చు. మంచి అలవాట్లు పెంపొందుతాయి. జర్నీ పుస్తకంలో కథలు రాసిన కథకులు అందరికీ అభినందనలు.
– చనగాని సాత్విక,
8వ తరగతి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తాటికల్‌, నకిరేకల్‌ మండలం,
నల్గొండ జిల్లా.