పవర్‌ఫుల్‌ పోలీస్‌ కథ

Story of Powerful Policeబ్లాక్‌బస్టర్‌ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారతీయ చిత్రాల్లోని విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్‌ గిల్‌ అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా దేవ్‌ గిల్‌ ప్రొడక్షన్స్‌ రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’. ఈనెల 30న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అసుర అనే విలన్‌ ఓ ప్రాంతాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకుని ఉంటాడు. అలాంటి అసురుడిని అంతమొందించటానికి ఆ ప్రాంతంలోకి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ వస్తాడు. తనేం చేశాడు.. ఎలా విలన్స్‌ భరతం పట్టాడు.. అనేది తెలుసుకోవాలంటే ఈనెల 30న విడుదలవుతున్న సినిమా చూడాల్సిందే అన్నట్టుగా ట్రైలర్‌ ఉండటం విశేషం. ఈ సందర్భంగా దేవ్‌ గిల్‌ మాట్లాడుతూ,’ ఈ సినిమాతో మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని, వారి అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు నాలోని నటుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్షకులు మరో కోణాన్ని వెండితెరపై చూస్తారు’ అని తెలిపారు. దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ, ‘పోలీసుల పవర్‌ను తెలిపే సినిమా ఇది. ఇందులో సరికొత్త దేవ్‌ గిల్‌ను చూస్తారు’ అని చెప్పారు.