వింత చేష్టలు..పిచ్చి ఆలోచనలు

అల్లుడిని మర్యాదగా, అభిమానంగా చూసుకుంటే కూతురు జీవితం బాగుంటుందని భావిస్తుంది తల్లి. అలాంటి బంధాలను కూడా ఇలా ఆలోచిస్తే ఎలా? అసలు బంధాలకు విలువే లేకుండా పోతుంది. నీకు అత్త ప్రేమకు, భార్య ప్రేమకు తేడా తెలియడం లేదు. ముందు అది తెలుసుకో…
కొన్ని బంధుత్వాలు పుట్టుకతో ఏర్పడతాయి. అవి సహజంగా ఏర్పడిన బంధాలు. వీటిని మనం మార్చలేం. కొన్ని బంధాలను మనం ఏర్పరచుకుంటాం. భార్యాభర్తల సంబంధం, స్నేహితులు అలాంటి బంధాలే. అయితే ఒకసారి ఏర్పడిన బంధాన్ని ఉంచుకోవడం, తుంచుకోవడం మన ప్రవర్తనలోనే ఉంటుంది. బంధాలు ఏర్పరచుకోవడం ఎంత సులభమో, వాటిని నిలుపుకోవడం అంత కష్టం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి తోడు కోరుకుంటారు. అయితే ఆ కోరుకున్న బంధాలు కొన్ని సందర్భాలు మనకు ప్రతిబంధకాలుగా మారతాయి. అలాంటి కేసు వివరాలే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
‘సుమతితో నా సంబంధం గురించి మా ఇంట్లో తెలుసు. నా భార్య ఆరోగ్యం బాగోదు. అందుకే ఆమె కూడా మా సంబంధానికి ఒప్పుకుంది. అయితే ఈ మధ్యనే ఆమె చనిపోయింది. నా పిల్లలు కూడా సుమతిని నన్ను పెండ్లి చేసుకోమంటున్నారు. కానీ సుమతి మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ వయసులో పెండ్లి చేసుకుంటే అందరూ ఏమనుకుంటారో అని భయపడుతుంది’
సుమతికి ముగ్గురు అమ్మాయిలు. భర్తకు తాగే అలవాటు ఉండేది. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. భార్యా పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు. సుమతి మామయ్యనే ఇంట్లోకి సరుకులు తెచ్చి ఇచ్చేవాడు. ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారయింది. తప్పనిసరి పరిస్థితుల్లో సుమతి ఉద్యోగంలో చేరింది.
సుమతి చిన్న కూతురు 16 ఏండ్లకే ఒక అబ్బాయిని ప్రేమించి పెండ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు కూడా అందరూ సుమతినే తిట్టారు. ఆమె భర్తను మాత్రం ఎవ్వరూ ఒక్క మాట అనలేదు. కొన్నేండ్లకు రెండో కూతురు కూడా కాలేజీలో ఎవరినో ప్రేమించానని చెప్పింది. దానికి సుమతి ఒప్పుకోలేదు. ‘చిన్నదానిలా నేనూ ఇంట్లో నుండి వెళ్ళిపోకూడదనుకుంటే నాకు నీవే పెండ్లి చేయ్యి లేకుంటే నేనూ వెళ్ళిపోతాను’ అని కూతురు బెదిరించింది. దాంతో బంధువులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఆ అబ్బాయి గురించి ఆరా తీస్తే మంచి అబ్బాయి అని తెలిసింది. కానీ వాళ్ళ అమ్మానాన్న ‘మీది వేరే కులం. ఈ పెండ్లి తర్వాత మేము ఎప్పుడూ మీ ఇంటికి రాము’ అని షరతు పెట్టారు. పెండ్లి తర్వాత పరిస్థితి మారుతుందిలే అని ఒప్పుకుని పెండ్లి చేసారు.
          సుమతి భర్త ఆరోగ్యం బాగా క్షీణించింది. అన్ని ఆమే దగ్గురుండే చూసుకోవాలి. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాటు చేసి ఉద్యోగానికి వెళ్ళేది. ఇటువంటి సమయంలో ఆమెకు ఉద్యోగం చేసే దగ్గర వేరే అతనితో పరిచయమయింది. అతనితో సుమతి చాలా చనువుగా ఉండేది. పిల్లలకు భర్తకు ఈ విషయం తెలిసింది. కానీ ఎవ్వరూ ఏమీ అనలేదు. ‘నేను ఇప్పుడు మంచంలోనే పడున్నాను. ఎటూ కదలలేని పరిస్థితి నాది. ఇలాంటి సమయంలో ఆమే ఒక తోడు వెతుక్కుంది. దయచేసి ఎవరూ ఆమెను ఏమీ అనకండి’ అని భర్త కుటుంబ సభ్యుల దగ్గర మాట తీసుకున్నాడు. ఇక మూడో కూతురు కూడా ఓ అబ్బాయిని ప్రేమిస్తే అందరి సమక్షంలో ఒప్పించి పెండ్లి చేశారు. ఆ పెండ్లి అయిన నెలకి సుమతి భర్త చనిపోయాడు. ఆ సమయంలో ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్ళు అందరూ నెల రోజుల పాటు సుమతితోనే ఉన్నారు. అల్లుళ్లు అందరూ చాలా మంచివాళ్ళు. ఆమెను సొంత తల్లిలా చూసుకునే వారు. రెండో అల్లుడైతే ఆమెతో చాలా ఆప్యాయంగా ఉండేవాడు. ఆమె కూడా అతన్ని బాగా చూసుకునేది.
          భార్యతో కంటే ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. భార్య లేకపోయినా అతనే అత్తగారింటికి వచ్చేవాడు. ఆమెకు కావాల్సినవన్నీ చూసుకునేవాడు. అలా ఆరు నెలలు గడిచింది. పిల్లలు వాళ్ళ అమ్మకు ఆఫీసు దగ్గర పరిచయం అయిన వ్యక్తికిచ్చి పెండ్లి చేయాలనుకున్నారు. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు. ‘అతనికి భార్యా పిల్లలు ఉన్నారు. నా స్వార్థం కోసం వాళ్ళకు అన్యాయం చేయలేను’ అంది. చేసేది లేక తల్లి మాటకు పిల్లలు సరే అన్నారు. అప్పటి నుండి రెండో అల్లుడి ప్రవర్తనలో తేడాను గమనించింది సుమతి. ఈ విషయం కూతురితో చెబితే బాధ పడుతుందని చెప్పలేకపోయింది. కానీ అతనికి మాత్రం కచ్చితంగా చెప్పింది.
          ‘నీ ప్రవర్తన మంచిది కాదు. అల్లుడు అంటే కొడుకుతో సమానం. నేను నీకు తల్లిల్లాంటి దాన్ని. నీవు నా గురించి ఇలా ఆలోచించడం బాగోలేదు. ఇక నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నా కూతురితో సంతోషంగా ఉండు’ అని చెప్పింది. కానీ భర్త తనని చాలా రోజుల నుండి పట్టించుకోపోయే సరికి అక్కడ రెండో కూతురు వేరే అబ్బాయికి దగ్గరైంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ విషయం సుమతికి తెలిసి కూతురి జీవితం నిలబెట్టమంటూ పరిష్కారం కోసం మా దగ్గరకు వచ్చింది.
          మేము అల్లుడికి, కూతురికి ఫోన్‌ చేసి పిలిపించాం. కూతురు మాట్లాడుతూ ‘మా అమ్మకు ఒక తోడు కావాలి. మా ఆయనకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అందుకే నేను వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని వెళ్ళిపోతే మా అమ్మ, నా భర్త నా ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఉంటారు. నేను ఉంటే మా అమ్మ అతన్ని దగ్గరకు రానియ్యదు. అదే నేను లేకపోతే అతనికి కూడా తోడు అవసరమని ఏమీ అనదు. కాబట్టి నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను’ అంది. అమె మాటలు మాకు చాలా వింతగా అనిపించాయి.
          ‘తోడు అంటే కేవలం శారీరక సంబంధమేనా. అల్లుడూ, కొడుకులాగా ఆమెకు తోడుగా ఉండలేడా?’ అన్నాము. ఇక అల్లుడు మాట్లాడుతూ ‘మొదట్లో మా అత్తయ్యపైన నాకు జాలి ఉండేది. అది ఎప్పుడు ప్రేమగా మారిందో నాకే తెలియదు. ఇప్పుడు నేను ఆమెను చూడకుండా ఉండలేను. ఆమె నాపైన చూపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగం నాకు బాగా అనిపిస్తాయి. నాకు నా భార్యతో కంటే ఆమెతో ఉండటమే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ ఏదో ఒక వంకతో మా అత్తగారింటికి వెళ్ళి వస్తుంటాను. నేను ఇలా ప్రవర్తించడం వల్ల నాభార్య వేరే వ్యక్తికి దగ్గరయింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు’ అన్నాడు.
          ఒక వ్యక్తిపై ప్రేమ చూపించడానికి శారీరక సంబంధం అవసరం లేదు. మనం ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిపై ప్రేమ చూపిస్తాము. అందులో తల్లి, పిల్లలు, భర్త, భార్య, అత్తమామలు, ఆడపడుచు, బావ, తోడికోడళ్లు ఇలా ఎందరో ఉంటారు. అందులో అల్లుడు కూడా ఉంటాడు. కోడళ్లు కూడా ఉంటారు. కోడళ్ళను ప్రేమగా చూసుకుంటే కొడుకు జీవితం బాగుంటుందని ఓ అత్త భావించి కోడలని ప్రేమగా చూసుకుంటుంది. అలాగే అల్లుడిని మర్యాదగా, అభిమానంగా చూసుకుంటే కూతురు జీవితం బాగుంటుందని భావిస్తుంది తల్లి. అలాంటి బంధాలను కూడా ఇలా ఆలోచిస్తే ఎలా? అసలు బంధాలకు విలువే లేకుండా పోతుంది. నీకు అత్త ప్రేమకు, భార్య ప్రేమకు తేడా తెలియడం లేదు. ముందు అది తెలుసుకో’ అని అతనికి చెప్పి
          సుమతి కూతురితో ‘మీ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారు. నీ భర్త చెడు మార్గంలో నడుస్తుంటే నువ్వు నీ దారి చూసుకుంటున్నావు. పైగా మా అమ్మకు ఓ తోడు కావాలంటున్నావు. పరాయి వ్యక్తిని పెండ్లి చేసుకోమంటేనే అతనికి భార్యా పిల్లలు ఉన్నారని పెండ్లికి నిరాకరించిన నీ తల్లి నీ భర్తను ఎలా పెండ్లి చేసుకుంటుందనుకున్నావు. ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా? నీ పిల్లలు ఎదిగిన తర్వాత తండ్రి, అమ్మమ్మ కలిసి ఉండడం చూసి ఎలా అర్థం చేసుకుంటారు. మనతో పాటు ఓ సమాజం ఉంది. అది మీకు గుర్తుందో లేదో. మనతో పాటుగా కుటుంబ విలువలకు కూడా మనం కాపాడాలి. ఇలాంటి వింత చేష్టల వల్ల సమస్యలు తప్ప మంచి జరగదు’ అని గట్టిగా చెప్పారు. భార్యా భర్తలు ఇద్దరూ తమ తప్పును అంగీకరించారు. మళ్ళీ అలాంటి పొరపాటు చేయమని చెప్పారు.
          సుమతికి పరిచయం ఉన్న వ్యక్తిని కూడా పిలిచి మాట్లాడితే ‘సుమతితో నా సంబంధం గురించి మా ఇంట్లో తెలుసు. నా భార్య ఆరోగ్యం బాగోదు. అందుకే ఆమె కూడా మా సంబంధానికి ఒప్పుకుంది. అయితే ఈ మధ్యనే ఆమె చనిపోయింది. నా పిల్లలు కూడా సుమతిని నన్ను పెండ్లి చేసుకోమంటున్నారు. కానీ సుమతి మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ వయసులో పెండ్లి చేసుకుంటే అందరూ ఏమనుకుంటారో అని భయపడుతుంది’ అన్నాడు. ‘నీ భర్త చనిపోయాడు, అతని భార్య చనిపోయింది. మీ ఇద్దరికీ ఓ తోడు కావాలి. మీరు పెండ్లి చేసుకుంటే తప్పేం లేదు. మీ పిల్లలే మీ పెండ్లికి ఒప్పుకున్నారు. ఇక మీకేంటి సమస్య. కావాలంటే మీ బంధువులతో మేము మాట్లాడతాము. మీ ఇద్దరి పెండ్లి వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి’ అన్నాము. దానికి సుమతి కూడా ఒప్పుకుంది. ఇప్పుడు వారిద్దరూ పెండ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నారు. అల్లుడు, కూతురిలో కూడా మార్పు వచ్చింది.

– వై. వరలక్ష్మి, 9948794051