– అభ్యర్థుల ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
– అధికారంలోకి వచ్చిన వెంటనే… ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకం..
న్యూఢిల్లీ : అభ్యర్థుల ప్రకటనపై వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను పట్టిపీడిస్తున్న కేసీఆర్ అనే రావణాసురుడి నుంచి విముక్తి కల్పించేలా ఈ విజయ దశమికి రాష్ట్ర ప్రజలు కార్యోన్ముఖులై ముందుకు రావాలన్నారు. తామిచ్చిన ఆరు గ్యారెంటీలే… 119 నియోజక వర్గాల్లో తమ అభ్యర్థులని చెప్పారు. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నాడిక్కడ తెలంగాణ భవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు. ‘తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతున్నది. రాబోయే విజయదశమిని తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవాలి’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘సంపద పెంచాలి… పేదలకు పంచాలి’ అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందన్నారు. కానీ బీఆర్‌ఎస్ సర్కార్ మాత్రం… 3 వేల వైన్ షాపులు, 18 వేల బార్లు, 62 వేల బెల్ట్ షాపులతో తెలంగాణను మద్యంలో ముంచిందని విమర్శించారు.
కేసీఆర్‌కు చలిజ్వరం పట్టుకుంది
సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి కేసీఆర్‌కు చలిజ్వరం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా-రంగాలలో మొదలైందని… అందుకే స్థాయి లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో యూపీఏ, బీఆర్‌ఎస్‌ల పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం పదివేల ఎకరాలు, లక్ష కోట్లు దోచుకుందని ఆరోపించారు. అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలోనూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ‘కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చింది. కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది… ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. డిసెంబర్‌లో అద్భుతం జరగబోతుంది… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది’ అని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే… ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకం చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే కుట్ర
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 2018లోనూ బీజేపీ ఇలాంటి కుట్రలే చేసి, 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందని, ఈ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకటే అని… అటు మోడీ, ఇటు కేటీఆర్ లు అంగీకరించారన్నారు. తాము బీజేపీ, బీఆరెస్ పై విమర్శలు చేస్తుంటే… అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు.