దారి తప్పిన గురువులు..!

Lost teachers..!– విధులకు డుమ్మా కొట్టి దావత్ కు పోయిన 11 మంది లెక్చరర్లు
– నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ బాలుర జూనియర్ కళాశాల లెక్చరర్ల నిర్వాకం
– ఒకేసారి 11 మంది లెక్చరర్లు విధులకు డుమ్మా
– ప్రిన్సిపల్ ని నిలదీసిన విద్యార్థి సంఘ నాయకులు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంది. పిల్లలను తల్లిదండ్రులు కానీపెంచినప్పటికీ.. వారికి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో గొప్ప స్థానానికి చేరేలా చేసేది గురువులు మాత్రమే. అందుకే మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ అంటారు. విద్యార్థులు దారి తప్పితే వారిని సన్మార్గంలో నడిపించే గురువులు వారే దారి తప్పితే ఇక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్దకమే.  విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొంతమంది గురువులు ప్రస్తుతం దారి తప్పుతున్నారాని ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాల కు చెందిన 11 మంది లెక్చరర్లు సెలవులు పెట్టకుండా  మూకుమ్మడిగా విధులకు డుమ్మా కొట్టారు. ఇటీవల కళాశాలలో పనిచేసిన ఒక లెక్చరర్ తండ్రి దినాలు ఉండడంతో శనివారం రోజు 11 మంది లెక్చరర్లు ఎలాంటి అనుమతి లేకుండానే విధులకు డుమ్మా కొట్టారు. కళాశాలలో మొత్తం 39 మంది లెక్చరర్లు విధులు నిర్వహిస్తుండగా 11 మంది విధులకు హాజరు కాకపోవడంతో కళాశాలకు హాజరైన విద్యార్థులు పాఠాలు చెప్పే లెక్చరర్లు లేక ఉసూరుమంటూ ఇండ్లకు తిరిగి వెళ్లిపోయారు. విద్యార్థుల ఫిర్యాదుతో కళాశాలకు చేరుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు కళాశాల ప్రిన్సిపల్ ఎం సి రాకేంద్ కుమార్ ను కలిసి లెక్చరర్ల మూకుమ్మడి డుమ్మాలపై వివరణ అడిగారు. విద్యార్థి సంఘ నాయకుల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రిన్సిపల్ రాకేంద్ కుమార్ 11 మంది లెక్చరర్లు సిఎల్ పెట్టి వెళ్లారని చెప్పారు. ఈ మాటలను నమ్మని విద్యార్థి సంఘ నాయకులు తమకు హాజరు రిజిస్టర్ చూపించాలని కోరగా ప్రిన్సిపల్ అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘం నాయకులు విధుల కు సెలవు చీటీలు పెట్టకుండా డుమ్మా కొట్టిన 11 మంది లెక్చరర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే జిల్లావ్యాప్తంగా  ఉన్న ప్రభుత్వ కళాశాల పరిస్థితి ఏంటని ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, ప్రశ్నిస్తున్నాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలు అంటే ఇంతటిచ్చిట చూపా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులు అంటే పట్టింపు ఉండదా అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి కుమారుని స్మారకార్థం నడుస్తున్న కళాశాలలో దుస్థితి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ స్మారకార్ధం నల్లగొండ పట్టణంలో ని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎంతో వ్యయం చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అయినా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లు ఏమాత్రం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పకుండా తమ ఇష్టా రీతిలో నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కళాశాల పక్కనే జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి కార్యాలయం కూడా ఉండడం మరో విశేషం. కనీసం అధికారులు తనిఖీ చేస్తారన్న భయం లేకుండా అధ్యాపకులు మూకుమ్మడిగా విధులకు గైర్హాజరు కావడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. అధికారులు కళాశాలలో జరిగిన వాస్తవ పరిస్థితులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఫోన్ ద్వారా చెప్పారు..ఎంసీ. రాకేంద్ కుమార్ (ప్రిన్సిపల్, కోమటిరెడ్డి ప్రతీక్ బాలుర జూనియర్ కళాశాల)
శుక్రవారం రోజు 11 మంది లెక్చరర్లు విధులకు హాజరు కాకపోవడం వాస్తవమేనని కోమటిరెడ్డి ప్రతీక్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాకేంద్ కుమార్ చెప్పారు. వారంతా సిఎల్ పెట్టారని తెలిపారు. లెక్చరర్లు వాళ్ళకున్న అవసరాన్ని, ఒత్తిడిని బట్టి ఫోన్ ద్వారా సెలవు కావాలని చెప్పారు.కళాశాలలో ఒకేసారి 11 మంది లెక్చరర్ లకు సిఎల్ ఎలా మంజూరు చేశారని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేకపోయారు.
జెడికి నివేదిక పంపిస్తా.. దస్రు నాయక్ (జిల్లా ఇంటర్మీడియట్ అధికారి)
విషయం నాకు కూడా తెలిసింది. రేపు, ఎల్లుండి సెలవు ఉంది. సెలవు అనంతరం పూర్తి వివరాలు కనుక్కొని జెడి కి నివేదిక పంపిస్తాం.