యూనివర్సిటీల సిబ్బందిని క్రమబద్ధీకరించండి

– మంత్రి హరీశ్‌రావుకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న టైమ్‌ స్కేల్‌, డైలీవేజ్‌, ఎన్‌ఎంఆర్‌, కంటింజెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌, అధ్యక్షులు వి.నారాయణ, ఉపాధ్యక్షులు మహేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి వర్సిటీ సిబ్బంది డిమాండ్లను తీసుకెళ్లారు. వారికి ఇస్తున్న మూల వేతనాన్ని కనీస వేతనంగా చెల్లించాలని కోరారు. అప్పటిలోగా రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల జీఓ 63 ప్రకారం కనీస వేతనాలు అన్ని యూనివర్సిటీల్లో తప్పనిసరిగా అమలు చేయాలని విన్నవించారు. జీఓ నెం.16 ప్రకారం యూనివర్సిటీల్లోని ఖాళీల ఆధారంగా టైమ్‌ స్కేల్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. పదేండ్ల సర్వీస్‌ దాటిన వారిని టైం స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కాంట్రాక్టర్‌ మారితే సిబ్బందిని తొలగించే అన్‌ఫెయిర్‌ లేబర్‌ ప్రాక్టీసెస్‌ మానుకోవాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డయిన సిబ్బందికి రూ.5 లక్షలు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలని కోరారు. ఈఎస్‌ఐ, పిఎఫ్‌ అమలు చేయాలన్నారు. గుర్తింపు, హెల్త్‌ కార్డులివ్వాలనీ, బస్సుపాస్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలని కోరారు.