– ఇంచార్జ్ ఎంపీడీవో బి.శ్రీనివాసరావు
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండలంలో ప్రస్తుతం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈతకు, స్నానాలకు, చేపల వేటకు వాగులు, చెరువులు, తదితర వాటి దగ్గరకు వెళ్లకుండా కట్టడి చేయాలని స్థానిక ఇంచార్జ్ ఎంపీడీవో బత్తిన శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం రాయిపాడు గ్రామ సమీపాన గల బ్రిడ్జి వద్ద కిన్నెరసాని వాగు వరద ఉధృతిని నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో కిన్నెరసాని వాగు పొంగి ప్రవహిస్తున్న కారణంగా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున దాటరాదని చెప్పారు. చేను పనులకు, పశువులను మేపడానికి వాగులు, వంకలు దాటే రైతులు, కాపరులు వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయాల్లో దాటొద్దన్నారు. వాగుల వరద ఉధృతి తగ్గేవరకు ప్రజలు ఇంటి పట్టున ఉండాలని చెప్పారు. మహిళలు బట్టలు ఉతకడానికి సైతం వాగుల వైపు వెళ్లొద్దని సూచించారు.