ఈవీఎం మిషన్ల గోదాం చుట్టూ స్ట్రీట్‌ లైట్‌లు అమర్చాలి

– జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
నవతెలంగాణ-సిద్దిపేట కలెక్టరేట్‌
సమీకత జిల్లా కార్యాలయ సముదాయం పక్కనే నిర్మించిన ఎలక్షన్‌ గోదాంలో అదనంగా రూ.2.20 కోట్ల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తు గోదాం ముందు భాగంలో కమిషనింగ్‌ గదిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జే .పాటిల్‌ పరిశీలించారు. గోదాం చుట్టూ స్ట్రీట్‌ లైట్‌లు అమర్చాలని అధికారులను ఆదేశించారు. మైదానంలో మొక్కలు నాటాలన్నారు. నియోజకవర్గాల వారీగా నిర్మించిన స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించారు. ఎలక్ట్రిసిటీ వసతుల లోపాలు ఉంటే సరిచూసుకోవాలన్నారు. ప్రతి గదికి పేర్లను పెట్టాలని, ఎలక్షన్‌ ప్రక్రియలో కౌంటింగ్‌ పూర్తికాగానే ఇవిఎం మిషన్లను ఈ గోదాంలో భద్రపరచాలని అధికారులకు సూచించారు. చిన్నచిన్న పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎలక్షన్స్‌ సూపరిండెంట్‌ రామేశ్వర్‌, డిటి ఎలక్షన్‌ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏవో అబ్దుల్‌ రెహమాన్‌, ఆర్‌ అండ్‌ బి ఈఈ రాములు, డిఇ వెంకటేష్‌ ఉన్నారు.