– పాదచారులు, వాహనదారులు ఇక్కట్లు
– విష జ్వరాల వ్యాప్తి, ఆందోళనలో ప్రజలు
– మరమ్మతులు చేపట్టాలని వేడుకోలు
నవతెలంగాణ – పెద్దవంగర
మండల వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ ఛిద్రమైయ్యాయి. వర్షపు నీటికి ఆయా గ్రామాల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, నీటితో నిండుకుని చెరువును తలపిస్తున్నాయి. పెద్దవంగర పంచాయతీ పరిధిలోని పాత ఎస్సీ కాలనీలోని వీధులన్నీ వర్షాలకు అధ్వానంగా తయారయ్యాయి. చినుకు పడితే బురదమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో నుండి బయటకు రావాలంటే జంకుతున్నారు. కాలనీలో సైడు కాలువలు లేకపోవడం వల్ల గతంలో వేసిన సీసీ రోడ్లు మీదనే వర్షపు నీరు నిల్వ ఉంటుంది. దీంతో దుర్గంధం వస్తుందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి మురుగు నీటితో సావాసం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే కాలనీ పరిసరాల్లో నీరంతా చేరి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ రోడ్లలో ప్రయాణం చేయాలంటే నరకం అనుభవిస్తున్నాం అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోకాళ్ల లోతు నీరు నిలువ ఉంటోందని వాపోతున్నారు. దీంతో ఈ వీదుల్లో రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. మండలంలో పలు గ్రామాల్లో సైతం వర్షం నీరు రోడ్డు మీదనే నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చిన్న చిన్న వర్షానికి సైతం వీదుల్లో నీరు నిలుస్తుంది. సైడు కాలువలు లేకపోవడం వల్ల ఎక్కడి నీరు అక్కడే నివ్వడం తో దోమల తో ఇబ్బందులు పడుతున్నాం. విషజ్వరాల బారినపడి ఆరోగ్యం దెబ్బతింటుంది. – సుంకరి రంజిత (పెద్దవంగర)
రోడ్ల మీదనే వర్షం నీరు నిల్వ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. నీటిలో నుండి వెలుతూ చిన్న పిల్లలు, వృద్ధులు పడిపోతున్నారు. వెంటనే సైడు కాలువలు నిర్మించి, నీరు నిల్వ లేకుండా చూడాలి: – చిలుక మహేష్ (పెద్దవంగర)