రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయండి

రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయండి– సీఎంకు రెవెన్యూ ఉద్యోగ సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, తెలంగాణ తహశీల్దార్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌.రాములు నేతృత్వంలో ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, భూ వివాదాలు మొదలగు సమస్యలు సకాలంలో పరిష్కారం కావాలంటే గతంలో మాదిరిగా గ్రామ, మండల స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచాలని సీఎంను కోరారు. రూరల్‌, సెమీ రూరల్‌, అర్బన్‌గా మూడు స్థాయిలుగా విభజిస్తే ప్రజలకు సేవలు మరింత, వేగంగా అందుతాయన్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 5,576 మంది పూర్వ వీఆర్‌వోల గత సర్వీసును పరిగనంలోకి తీసుకొని ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన జిల్లాలు, మండలాల ప్రాతిపదికన రెవెన్యూ ఉద్యోగుల సంఖ్యను పెంచాలని కోరారు. సమస్యల పట్ల సీఎం సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు కె.రామకష్ణ, ఎన్‌.ఆర్‌ సరిత, రమేష్‌ పాక, పూల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.