ఒత్తిడి

stressమనం ఒత్తిడికి గురి కావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి మన శక్తిని తక్కువగా అంచనా వేసుకోవడం, లేదంటే మన శక్తికి మించిన కోరికలు కలిగి ఉండడం. ఒకవేళ నిజంగానే మన శక్తికి మించిన కోరికలు మనలో ఉంటే వాటిని వదిలేయడం తప్పనిసరి. అనుకున్నది సాధించడానికి మనుషులు పగలూ రేయీ శ్రమిస్తుంటారు. ఇది ఎంతో ఒత్తిడికి గురి చేస్తోంది. నిజానికి మనం చేస్తున్న పని వల్ల మనకు ఆనందం కలిగితే దాని వల్ల ఎప్పుడూ ఒత్తిడి కలుగదు. అయితే, ఆ ఆనందం ఉన్నత లక్ష్యాల కోసం, ఉన్నత విలువల కోసం చేసే పనులలో మాత్రమే కలుగుతుంది. అలా కాకుండా అపరిమిత కోరికలు, వ్యాపకాలు పెంచుకుంటూ పోతే అది ఒత్తిడినే నింపుతుంది. అది శరీరాన్నీ, మనసునూ దెబ్బ తీస్తుంది. అయినా దాన్ని మనం పట్టించుకోం. ఫలితంగా కొద్దిరోజుల్లో శరీరం, మనసు తమ చైతన్యాన్ని కోల్పోతాయి. అప్పుడు ఆశల సాధనలో సహకరించడం మానేస్తాయి.

ఎంతో కొంత ఒత్తిడి అందరి మనసుల్లోనూ ఉంటుంది. నిజానికి అది అవసరం కూడా! ఒత్తిడి ఒక ఇంధనం లాంటిది. ఏ ఒత్తిడీ లేకపోతే మానవ జీవితంలో ఏ ప్రగతీ ఉండదు. ఇంధనం లేని వాహనంలా వారి గమనమే స్తంభించిపోతుంది. వాస్తవానికి ఒత్తిళ్లను ఎదుర్కొనే కొద్దీ మానసిక శక్తి మరింత బలపడుతుంది. ఒత్తిడి ఓ సవాలు లాంటిది. అలా సవాలుగా తీసుకునే వారికి ఒత్తిడి మంచే చేస్తుంది. కాకపోతే ఆ ఒత్తిడి ఒక పరిమితిలో ఉన్నంత వరకు సరే కానీ, ఆ పరిధి దాటిపోతేనే సమస్యలు మొదలవుతాయి. అలా పరిమితి దాటిపోవడానికి చాలా సార్లు మన ప్రణాళికలోనే ఏదో లోపం ఉంటుంది. మనం ఎంచుకునే మార్గంలోనే ఏదో లోపం ఉంటుంది. దాన్ని మనలో చాలా మంది గుర్తించలేరు. ఎవరైనా దాన్ని గుర్తించినా అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది.
మనం ఒత్తిడికి గురి కావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి మన శక్తిని తక్కువగా అంచనా వేసుకోవడం, లేదంటే మన శక్తికి మించిన కోరికలు కలిగి ఉండడం. ఒకవేళ నిజంగానే మన శక్తికి మించిన కోరికలు మనలో ఉంటే వాటిని వదిలేయడం తప్పనిసరి. అనుకున్నది సాధించడానికి మనుషులు పగలూ రేయీ శ్రమిస్తుంటారు. ఇది ఎంతో ఒత్తిడికి గురి చేస్తోంది. నిజానికి మనం చేస్తున్న పని వల్ల మనకు ఆనందం కలిగితే దాని వల్ల ఎప్పుడూ ఒత్తిడి కలుగదు. అయితే, ఆ ఆనందం ఉన్నత లక్ష్యాల కోసం, ఉన్నత విలువల కోసం చేసే పనులలో మాత్రమే కలుగుతుంది. అలా కాకుండా అపరిమిత కోరికలు, వ్యాపకాలు పెంచుకుంటూ పోతే అది ఒత్తిడినే నింపుతుంది. అది శరీరాన్నీ, మనసునూ దెబ్బ తీస్తుంది. అయినా దాన్ని మనం పట్టించుకోం. ఫలితంగా కొద్దిరోజుల్లో శరీరం, మనసు తమ చైతన్యాన్ని కోల్పోతాయి. అప్పుడు ఆశల సాధనలో సహకరించడం మానేస్తాయి.
మౌలికంగా మనిషులు ఆనందాన్ని కోరుకుంటారు. అయితే శాశ్వత ఆనందం శారీరక, భౌతిక విషయాల నుంచి రాదు. కానీ ఈ ఆధునిక కాలంలో ఈ సత్యాన్ని గమనించడంలో మనం నిర్లక్ష్యం వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం బయట వెతుకుతున్నారు. కానీ నిజానికి అది ఉన్నది మనలోనే! ఒత్తిడి ఎక్కువగా పోటీతత్త్వం నుంచి వస్తుంది. అది ఆరోగ్యకరంగా ఉంటే నష్టమేమీ ఉండదు. కానీ చాలాసార్లు అది అసూయ, ద్వేషాల మధ్య కాలిపోతోంది. ఎదుటి వారిని తనలో భాగమనుకునే భావన తగ్గిపోతుంది. ఇలాంటి ఆలోచన మనుషుల సంతోషాన్ని హరించివేస్తోంది.
నలుగురి గురించి ఆలోచిస్తే మనం క్రమశిక్షణలో ఉండగలం. ఈ క్రమశిక్షణను కోల్పోయినప్పుడు మనిషికి దేని మీదా అదుపు ఉండదు. వాస్తవానికి సంతోషంగా లేని వారు ప్రతి పనిలోనూ ఒత్తిడికి గురవుతుంటారు. మనసులో సంతోషమే ఉంటే అది ఎన్ని ఒత్తిళ్లనైనా అధిగమించేలా చేస్తుంది. ఒత్తిడి దశలు వేరు కావచ్చు. కానీ అసలే ఒత్తిడి లేని వారంటూ ఎవరూ ఉండరు. కాకపోతే ఒత్తిడిని సానుకూలంగా చూస్తున్నారా, ప్రతికూలంగా చూస్తున్నారా అన్నది ముఖ్యం. సమాజం నుండి మనల్ని మనం విడదీసుకుని చూసుకోవడం కూడా ఈ ఒత్తిడికి కారణం. హృదయం సంకుచితమైతే ప్రతిదీ బాధిస్తుంది. విశాలమైతే ఆనందాన్నిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించాలి. అందరం సమానం అనుకున్నప్పుడు ఇతరులతో కలిసిపోగలం. అప్పుడు ఇతరుల కష్టాలే కాదు, ఇతరుల ఆనందాలూ మనవిగా భావిస్తాం. అలా మన పరిధి పెరుగుతుంది. ఇది మానసిక ఒత్తిళ్లను అధిగమించేలా చేస్తుంది.