నకలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

– రైతులు విత్తనాల బిల్లులు భద్రంగా దాచి పెట్టాలి
– విత్తనాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన ఏఓ
నవతెలంగాణ-ఆమనగల్‌
నకలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు మండల వ్యవసాయ అధికారి అరుణ కుమారి అన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన వానా కాలం సీజన్‌లో భాగంగా బుధవారం మండలంలో ఉన్న పలు విత్తనాల విక్రయ కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి అరుణ కుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమనగల్‌ పట్టణంలో ఉన్న నాగార్జున ఆగ్రోకెమికల్స్‌, శ్రీ తిరుమల ఫెస్టిసైడ్స్‌ పెర్టిలైజర్స్‌, ఆకుతోటపల్లి గ్రామంలో ఉన్న రైతు మిత్ర ఆగ్రో ఏజెన్సీస్‌, ముర్తూజపల్లి గ్రామంలో ఉన్న రామాంజనేయ ట్రెడర్స్‌, ఆగ్రో రైతు సేవా కేంద్రం తదితర విత్తనాల, ఎరువుల విక్రయ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న నిల్వలను వాటి రసీదులను పరిశీలించారు. ఈ పాస్‌ ద్వారానే కొనుగోలు అమ్మకాలు జరుపాలని డీలర్లకు సూచించారు. షాపులో నిల్వలకు సంబంధించిన వివరాలు, విత్తనాలు, ఎరువుల ధరలను తెల్పే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రైతులు అన్ని జాగ్రత్తలు పాటించి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, వాటి రసీదులను పంట పూర్తయ్యే వరకు భద్రంగా దాచి పెట్టాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా షాపుల డీలర్లు వెంకటయ్య, చంద్రమౌళి, భరత్‌ రెడ్డి, నరేష్‌ రెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.