విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

– టీజీఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫారూఖీ హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫారూఖీ హెచ్చరించారు. ఈనెల 9వ తేదీ మాసబ్‌ట్యాంక్‌లోని చాచానెహ్రూ పార్క్‌ వద్ద ఉన్న 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక కారణంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం జరిగింది. అయితే దీన్ని మార్చడానికి గంటల కొద్ది సమయాన్ని తీసుకున్నారని సీఎమ్‌డీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన సదరు అధికారులపై సీరియస్‌ అయ్యారు. ఆలస్యానికి కారణాలు ఏంటో తెలుపుతూ నివేదిక ఇచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌ సూపెరింటెండింగ్‌ ఇంజనీర్‌ మోహన్‌రెడ్డిని ఆదేశించారు. ఆయన దీనిపై విచారణ జరిపి, సరఫరాలో అంతరాయం విషయం అధికారులకు తెలియజేయలేదనీ, విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకుగాను వివరణ ఇవ్వాలని మాసాబ్‌ట్యాంక్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నాగచైతన్య, మెహదీపట్నం అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ మల్లయ్యలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.