– చెట్లను నరికిన వ్యక్తుల పేర్లు అధికారులకు చెప్పాలి
– సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం
– గాజిరెడ్డిపల్లి గ్రామ సభలో ఎఫ్‌ఆర్‌వో మనోజ్ కుమార్
నవతెలంగాణ-హవేలీ ఘనపూర్
అడవుల్లో చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవని, అడవుల్లో చెట్లను నరికే వారి పేర్లు అధికారులకు తెలియజేస్తే గోప్యంగా ఉంచుతామని ఎఫ్‌ఆర్‌ఓ మనోజ్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని గాజిరెడ్డిపల్లి గ్రామస్తులతో కలిసి అటవీ శాఖ మండల అధికారులతో ఎఫ్‌ఆర్‌ఓ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజిరెడ్డిపల్లి శివారులో గల అడవి భూమిని అక్రమంగా చెట్లు నరికి ఆక్రమణకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను పట్టుకోవడానికి గ్రామస్తులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులను నరికితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, రాత్రిపూట చెట్లు నరికిన వారి పేర్లను డిపార్ట్మెంట్‌కు తెలియపరచాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 10 నుంచి 20 రోజుల్లో అటవీ భూమిని గుర్తించి కందకం ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమంగా ఫారెస్ట్ భూముల్లోకి ప్రవేశించి, ఫారెస్ట్ అధికారులు చెప్పిన వినకుండా పదేపదే అడవిలో చెట్లు నరికిన వ్యక్తులను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామాలలో ప్రభుత్వం హరితహారం కింద మొక్కలు నాటితే భావితరాలు బాగుండాలని ప్రభుత్వ పథకాలు పెడుతుంటే సంరక్షణ చేయాల్సింది పోయి అడవిని నరకటం మంచి పద్ధతి కాదని గ్రామస్తులకు తెలిపారు. అడవిలో చెట్లు నరికే వ్యక్తులను గుర్తించి గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సహకరించాలని సూచించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెట్లు నరికిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరికే కార్యక్రమానికి పాల్పడితే వారిపై పిడి యాక్ట్, ప్రభుత్వ పథకాలు వారి కుటుంబానికి రాకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీరామ్, ఎస్సై ఆనంద్ గౌడ్, సర్పంచ్ భాగ్యలక్ష్మి శ్రీనివాస్, రేంజ్ ఆఫీసర్ గీత, సెక్షన్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, గ్రామ ప్రజలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.