వరుస లైంగికదాడి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి

– హరీశ్‌ రావు ట్వీట్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో జరుగుతున్న వరుస లైంగిక దాడి ఘటనలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో నాలుగు లైంగికదాడులు జరగడం బాధాకరమని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని వ్యాఖ్యానించారు. మహిళలకు భద్రత కరువైందనీ, పెరిగిన లైంగిక దాడుల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాకముందే ఈ రతహా ఘటనలు జరగడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని చెప్పారు. చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే ప్రశ్న వేసువాల్సిన తరుణమని అన్నారు. మహిళల భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. వనస్థలిపురం పీఎస్‌ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై సామూహిక లైంగికదాడి, ఓయూ పీఎస్‌ పరిధిలో ప్రయాణీకురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అఘాయిత్యం చేయడం, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై లైంగికదాడి జరపడం, నిర్మల్‌ నుంచి ప్రకాశం వెళుతున్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులో మహిళపై డ్రైవర్‌ అఘాయిత్యం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. లైంగికదాడి బాధితులకు భరోసా కల్పించాలనీ, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.