బాల్య వివాహాన్ని ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని అబ్బాపూర్ (బి) తండాలో బాల్యవివాహానికి ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. బాల్య వివాహం జరిగిన ఘటనపై ఐసిడిఎస్ అధికారులతో వివరాలు తెలుసుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ 13 ఏళ్ల బాలికను 45 సంవత్సరాల పకీరాబాదుకు చెందిన సాహెబ్ రావు అర్ధరాత్రి పూట పెళ్లి చేసుకోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. వివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఐసిడిఎస్ మరియు మద్దతుగా నిలబడ్డ వారిపై బెదిరింపు చర్యలకు పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి కుమారుడు బాధితురాలి తండ్రికి 60 వేల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోందని కన్న కూతురిని అమ్మకానికి పెట్టిన తండ్రిపై, పెళ్లి చేసిన పూజారిపై మరియు సహకరించిన ఎంపిటిసి భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్, దేవేందర్ సింగ్ పాల్గొన్నారు.