– జిల్లా వ్యవసాయాధికారిని ఎస్.గీతారెడ్డి
నవతెలంగాణ-మొయినాబాద్
రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఇతర ఎరువులన్నీ నిత్యం అందుబాటులో ఉంచాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారిని ఎస్.గీతారెడ్డి అన్నారు. మొయి నాబాద్ మండల కేంద్రంలో పలు ఎరువుల దుకాణాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీలర్లు ఎరువులు రైతులకు అమ్మినప్పుడు విధిగా ఈ పాస్ మిషన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. ఎరువుల డీలర్లు ఎమ్మా ర్పీకి మించి ఎరువులు అమ్మితున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రైతులు కూడా ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని తెలిపారు. దీనికి ముందు మొయినాబాద్ రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లాలో వేసవిలో కూరగాయల సాగులో మెళుకువలు, శాస్త్రవేత్తల సూచనలను, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అందిచే సూచనలు, సలహాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాగమ్మ, ఏఈఓలు కుమార్, సునీల్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.