– టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్ హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిబద్దత, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై బస్సుల్లో దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగిస్తూ, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామనీ, పోలీసు శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బందిలో ఆత్మస్థైర్యం దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల మూడు చోట్ల మహిళలు దాడులకు పాల్పడ్డారనీ, హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్బాషలాడుతూ వేర్వేరుగా దాడికి దిగారని తెలిపారు. చిల్లర విషయంలో ఒక మహిళ, గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ను తీసుకోవాలని కండక్టర్ చెప్పినందుకు, ఆయన సెల్ ఫోన్ లాక్కుని అసభ్యపదజాలంతో మరొక మహిళ దూషించారని గుర్తుచేశారు. పికెట్ డిపో మహిళా కండక్టర్‌పై యాదగిరిగుట్టలో కొందరు మహిళలు సాముహికంగా దాడి చేశారని వివరించారు. ఈ మూడు ఘటనలపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఆర్టీసీ అధికారులు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారని తెలిపారు.
ప్రస్తుతం ఆ కేసుల దర్యాప్తు కొనసాగుతున్నదనీ, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ నియమావళి ప్రకారమే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారనీ, నిబంధనల మేరకే టికెట్ల జారీ ప్రక్రియను కండక్టర్లు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రయాణీకులు టికెట్ తీసుకోకుంటే, దాన్ని చెకింగ్‌లో గుర్తిస్తే సదరు సిబ్బంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనీ, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల అందరూ ప్రయాణ సమయంలో విధిగా టికెట్ తీసుకుని సిబ్బందికి సహకరించాలని ీ విజ్ఞప్తి చేశారు. ‘మహాలక్ష్మి’ స్కీం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ సిబ్బంది సమర్థవంతంగా అమలు చేస్తున్నారనీ, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజూ సగటున 27 లక్షల మంది మహిళా ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారని తెలిపారు. ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పని సరి అని సిబ్బంది చెబుతున్నా, ఇప్పటికీ కొందరు ఇప్పటికీ ఫొటో కాపీలు, స్మార్ట్‌ఫోన్లలో గుర్తింపు కార్డులను చూపిస్తున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడి ఘటనలు వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణీకులు తమ ఫిర్యాదులు, సమస్యలను సంస్థ దృష్టికి తీసుకువచ్చేందుకు బస్‌భవన్‌లో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామనీ, టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033 24 గంటలు అందుబాటులో ఉంటాయని వివరించారు. సోషల్ మీడియా ద్వారా కూడా సమస్యల్ని సంస్థ దృష్టికి రావొచ్చనీ, లేకుంటే నేరుగా సమీపంలోని డిపో కార్యాలయాలకు వెళ్లి చెప్పవచ్చని తెలిపారు. సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే విచారించి చర్యలు తీసుకుంటారన్నారు. ప్రయాణీకులు సహనం కోల్పోయి సిబ్బందిపై దాడులకు పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.