– జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-జైపూర్
గోదావరి ఇసుక అక్రమంగా తరలింపుకు పాల్పడితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జైపూర్ పోలీస్‌స్టేసన్ పరిధి ఇందారం శివారు నుండి గోదావరి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు డంపులను గుర్తించినట్లు తెలిపారు. స్థానిక ఎస్సై శ్రీధర్‌తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించిన వారి వివరాలు వెల్లడించారు. ఇందారం కేంద్రంగా గోదావరి ఇసుక తవ్వకాలు జరుపుతున్న ఆక్రమణదారులు టిప్పర్ల ద్వార ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఇందారం శివారులో ఇటీవల 50 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులు గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా మంగళవారం మరో 30 ట్రాక్టర్ల ఇసుక డంపును గుర్తించి బాధ్యులైన వారిని తహసీల్దార్ ఎదుట హాజరుపర్చి రూ.5 లక్షల స్వంత పూచికత్తుపై విడుదల చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఇసుక రవాణాకు వినియోగించిన ట్రాక్టర్లు సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లు, ఓనర్లపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కాగా తహసీల్దార్ ఎదుట హాజరుపర్చిన వారిలో ఇందారం, రామారావుపేట్‌కు చెందిన జైనోద్దీన్, గుండ శ్రీనివాస్, సాయికృష్ణ, రాజ్‌కుమార్, స్వామి, శేఖర్, సంపత్, దీపులు ఉన్నారు.