– ప్రశాంత వాతావరణంలో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవాలి
– మద్యం మత్తులో వాహనాలు నడిపితే జైలుకే
– ఎస్ఐ నర్సింగ్ వెంకన్న గౌడ్
నవతెలంగాణ-పెన్ పహాడ్ బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని మండల ఎస్ఐ నర్సింగ్ వెంకన్న గౌడ్ విలేకరులతో అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, మందుబాబులపై కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. బహిరంగ మద్యపానంపై, మద్యం తాగి వాహనాలు (డ్రంకెన్ డ్రైవ్) నడుపుతున్న వారిపై చట్టప్రకారం వ్యవహరిస్తామని అన్నారు.
గ్రామ శివారులు, నిర్మానుష్య ప్రాంతాలు, ఆట స్థలాలు, పాఠశాలల ప్రాంగణాలు, చెరువు కట్టలు, మూసి నది లాంటి ప్రాంతాల్లో సిబ్బంది ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తారని అన్నారు. అనుమానితులను విధిగా తనిఖీ చేస్తున్నామని, ఆరుబయట మద్యం తాగేవారి సమాచారం పోలీసు వారికి తెలియజేయాలని అన్నారు. మద్యం ప్రియులు ఆరుబయట మద్యం త్రాగడం మానుకోవాలని ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యంతాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కావున మద్యం తాగి వాహనాలు నడపవద్దని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు.