మార్గదర్శిపై కేసుల్లో కఠిన చర్యలు తీసుకోం

– రామోజీరావు, శైలజలకు హైకోర్టులో ఊరట
నవతెలంగాణ – హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థపై అక్కడి సీఐడీ నమోదు చేసిన కేసుల వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఏపీలో కేసుల నేపథ్యంలో ఇక్కడి హైకోర్టులో కేసు వేసేందుకు ఉన్న పరిధిపై ఉన్న చట్టబద్ధతను తేల్చుతామని ప్రకటించింది. విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఏపీ ప్రభుత్వం పిటిషనర్లపై చర్యలు తీసుకోబోమంటూ హామీ ఇవ్వాలనీ, లేనిపక్షంలో తామే మధ్యంతర ఉత్తర్వులిస్తామనీ ప్రకటించింది. ఈనెల 20వ తేదీ వరకు మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రామోజీరావు, శైలజలపై చర్యలు తీసుకోబోమని ఏపీ ప్రభుత్వ ప్లీడర్‌ గోవింద్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డి నమోదు చేసుకుని విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఏపీలో ఈనెల 10 తేదీన నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా అరెస్టు సహా బలవంతపు చర్యలు చేపట్టకుండా, హైదరాబాద్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రామోజీరావు, శైలజ వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్లను ఆయన సోమవారం విచారణ జరిపారు.నేరం జరిగినట్టుగా ప్రాథమికంగా ఆధారాలున్నాయని గోవింద్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో సోదాలు చేసే అధికారం ఏపీ పోలీసులకు లేదని పిటిషనర్ల సీనియర్‌ లాయర్‌ దుర్గాప్రసాద్‌ చెప్పారు. ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదనీ, అయినా తనిఖీలు చేయటం చట్ట వ్యతిరేమన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజ పేర్లున్నాయన్నారు. విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేశారు.
అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయొద్దు
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని తిరిగి ఆదేశాలిచ్చే వరకు అరెస్ట్‌ చేయరాదని సీబీఐకి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ సోమవారం ఆదేశించారు. సీబీఐ విచారణకు హాజరుకావాలన్న ఉత్తర్వులపై స్టే ఇవ్వాలనీ, విచారణకు హాజరైతే ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేసేలా సీబీఐకి ఉత్తర్వులివ్వాలని కోరుతూ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌ వెనుక సీబీఐ ప్రమేయముందని ఎంపీ లాయర్‌ వాదించారు. వివేకా హత్య వెనుక ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, హతుడి రెండో భార్య షమీమ్‌ పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీల్డ్‌ కవర్‌లో సీబీఐ హైకోర్టుకు ఇచ్చింది. హత్య ఘటనాస్థలంలో లభ్యమైన లేఖ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలను కూడా అందజేసింది.