పక్కాగా డీఎస్సీ రాతపరీక్షలు

– 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహణ : పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మెగా డీఎస్సీ రాతపరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత విధానం (సీబీఆర్టీ)లో రాతపరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీకి 2,79,966 దరఖాస్తులొచ్చాయి. డీఎస్సీ రాతపరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పరీక్షలను వాయిదా వేయడం వల్ల వచ్చే ఇబ్బందులు, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.