ఎలక్షన్‌ కోడ్‌ పటిష్టంగా అమలు చేయండి

– సమీక్షా సమావేశంలో సీఎస్‌ శాంతికుమారి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. దీనిపై సోమవారంనాడామె డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిస్థితి, చెక్‌పోస్టుల్లో సీజ్‌ చేసిన నగదు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర వస్తువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేగంపేట, శంషాబాద్‌ విమానాశ్రయాల్లోనూ తనిఖీలు చేయాలని ఆదేశించారు. సరిహద్దు జిల్లాల్లో డ్రై డేలను తెలపాలనీ, స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలపై నిఘా ఉంచాలని చెప్పారు. ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో 85 సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామనీ, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు నిఘాను పెంచాయని తెలిపారు. గడిచిన 15 రోజుల్లో దాదాపు రూ.35 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక సమీకృత సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా వాణిజ్య పన్నుల శాఖ నిఘాను పెంచిన ఫలితంగా రూ. 5.19 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల తయారీ, వ్యాపార గోడౌన్లపై కూడా నిఘా పెంచామన్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, సీనియర్‌ పోలీస్‌ అధికారులు మహేష్‌ భగవత్‌, సంజరు జైన్‌, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌ రాజు, రవాణా శాఖ కమిషనర్‌ బుద్ధ ప్రకాష్‌ జ్యోతి, ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ సమావేశంలో పాల్గొన్నారు.