తెలంగాణలో సమ్మె కాలం!

Strike period in Telangana!2014 ఎన్నికల ముందు సంవత్సరం పాటు ఒకవైపు కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు, పోరాటాలు చేశారు. కలెక్టరేట్లు ధర్నాలు, సమ్మె శిబిరాలతో నిండిపోయి ఉండేది. మరోవైపు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాలు జరిగేవి. 2014 జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భవించింది. కానీ కార్మికుల, ఉద్యోగుల వివిధ సెక్షన్ల ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. తెలంగాణ ఏర్పడితే ధర్నాలే ఉండవని చెప్పిన కేసీఆర్‌ పాలనలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు ధర్నాలతో దద్దరిల్లు తున్నాయి. అంగన్వాడీ టీచర్స్‌ హెల్పర్స్‌ 60 వేల మంది తమ డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 11 నుండి జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టారు. చర్చల ద్వారా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించ పోగా సమ్మెను నిర్బంధంతో అణిచి వేయాలని చూస్తోంది. అదిలాబాద్‌ అంగన్వాడీ లపై, సీఐటీయూ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది. సమ్మెపట్ల అసత్య ప్రచారాలు చేస్తున్నది. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పెన్షన్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వేతనంలో సగం పెన్షన్‌ నిర్ణయించా లని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలి. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.1.15పై.ల నుండి రూ. 5కు, గర్భిణీ/ బాలింతలకు రూ.2.40 పై.ల నుండి రూ.10కి పెంచాలని కోరుతున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆగస్టు 18న హైదరాబాద్‌లో అన్ని సంఘాలతో జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. కొన్నింటిపై హామీలు ఇచ్చారు. గతం కంటే వేతనాలు పెంచుతామని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష ఇస్తామని, అంగన్వాడి ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తించే విధంగా సర్కులర్‌ జారీ చేస్తామని చేస్మాని చెప్పారు. పది రోజుల్లో వేతనాలు పెంపు ప్రకటన కూడా వస్తుందని ఆమె హామీనిచ్చారు. కానీ, ఇచ్చిన హామీలకు భిన్నంగా వేతనాల పెంపు లేకపోగా అతి తక్కువ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ప్రకటించడంతో అంగన్వాడీల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమ య్యాయి. సమ్మె కారణంగా మూతపడిన అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఐసిడిఎస్‌ అధికారులు కొన్నిచోట్ల పగలగొట్టారు. సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
ఆశా వర్కర్లకు పారితోషికాలను రూ.18వేలకు పెంచి ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలని, ఇతర సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ సెప్టెంబర్‌ 25 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె ప్రారంభించారు. సమ్మెకు ముందు ”చలో హెల్త్‌ డైరెక్ట్‌” హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. 27 వేల మంది ఆశా వర్కర్లు గత 18 సంవత్సరాల నుండి గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్నారు. అనేక ట్రైనింగ్లు పొందారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు, ఇతర ప్రజలకు సేవలంది స్తున్నారు. బిపి, షుగర్‌, థైరాయిడ్‌ తదితర అన్నిరకాల జబ్బులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారు. తగిన జాగ్రత్తలు ఎప్పటి కప్పుడు ప్రజలకు వివరిస్తున్నారు. వీటితో పాటు రిజిస్టర్స్‌ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్‌ రికార్డులు నమోదు చేయడం వంటి పనులు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కాలంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) హెల్త్‌ గ్లోబల్‌ లీడర్స్‌ అని ఆశా వర్కర్లకు అవార్డును కూడా ప్రకటించింది. అన్ని పనులు నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్న ఆశాలకు నేటికీ ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయం చేయకపోవడం వలన ఆశా వర్కర్లు అన్యాయానికి గురవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న ఎఎన్‌ఎమ్‌లు ఐదు వేల మంది ఆగస్టు15 నుండి సెప్టెంబర్‌ 3 వరకు సమ్మె చేశారు. వీరి డిమాండ్ల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేయడంతో సమ్మె విరమించారు. కమిటీ రిపోర్టు కాలయాపన చేస్తున్న నేపథ్యంలో మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. డీఎస్సి ద్వారా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌, మెరిట్‌ ప్రకారం ఎంపికై పని చేస్తున్న వీరందరినీ రెగ్యులరైజ్‌ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఎంపిహెచ్‌ఎఎఫ్‌) 1,520 పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్‌ 2/2023ను జారీ చేసింది. సంవత్సరాల తరబడి సర్వీస్‌ అనుభవం ఉన్నప్పటికీ మళ్ళీ పరీక్ష రాయమనడం న్యాయం కాదు. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాల విషయంలో ద్వంద్వ ప్రమా ణాలు అనుసరించడం శోచనీయం. కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఆఫీసర్లను మెరిట్‌ ఆధారంగా సర్వీసుకు వెయిటేజి ఇచ్చి రెగ్యులర్‌ చేశారు. జీఓ నెం. 49 ప్రకారం 68 మంది కాంట్రాక్ట్‌ ఎంపిహెచ్‌ఎ (ఫిమేల్‌) లను యదావిధిగా రెగ్యులర్‌ చేశారు.
రాష్ట్రంలోని సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు 21 వేల మంది ఉద్యోగభద్రత, మినిమం టైం స్కేల్‌ ఇతర సమస్యల పరిష్కారం కోసం 21 రోజులపాటు సమ్మె చేశారు.జిల్లా కలెక్టరేట్ల ఎదుట రిలే దీక్షలు చేశారు. విద్యాశాఖ మంత్రి హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌, ఫిక్స్డ్‌ పే తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న సిబ్బందినందరినీ పర్మినెంట్‌ చేయాలని, మున్సిపాల్టీల్లో రూ.21 వేలు, జిహెచ్‌ఎం.సి పరిధిలో రూ.24వేల వేతనం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళన, పోరాటాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు సామూ హికంగా వినతి పత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరవధిక సమ్మెకు సిద్దమౌతున్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీ కార్మికులు 54 రోజుల పాటు సమ్మె చేశారు. మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2500 మంది స్కూల్‌ స్వీపర్లు నెలకు రూ.5200లకు పని చేస్తున్నారు. రెగ్యులరైజ్‌ చేయాలని లేదా కనిసవేతనం రూ.18 వేలు ఇవ్వాలని వీరు గత 76 రోజులుగా కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌ వ్యవస్థను రద్దు చేస్తామని ఉద్యమ సమయంలో మాట్లాడిన కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తానే ముఖ్యమంత్రి అయి 9 సంవత్సరాలు పూర్తి అయినా మాట నిలబెట్టుకో లేదు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ యూనియన్లు, అసోసియేషన్ల లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 90 వేల మంది ఔట్‌సోర్సింగ్‌, 40 వేల మంది కాంట్రాక్ట్‌ మొత్తం లక్షా 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ తొమ్మిదేండ్ల కాలంలో కేవలం 26 వేల మందిని మాత్రమే రెగ్యులరైజ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, విఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేయడం, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఎన్నికలుంటే గాని ప్రజలు, పథకాలు కార్మికులు, ఉద్యోగులు గుర్తురాని ముఖ్యమంత్రి ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగ, కార్మికులు కోరుతున్నారు.

గీట్ల ముకుందరెడ్డి
9490098857