సమస్యలు పరిష్కరించరు.. సమ్మెలు వద్దంటారు..!!

– కార్మిక హక్కులు కాలరాస్తున్న మోడీ, కేసీఆర్‌
– ఎన్నికల్లో కార్మికవర్గ సత్తా చూపాలి..
– కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాల్సిందే..! :కార్మిక మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– ఖమ్మం నగర వీధుల్లో స్కీమ్‌ వర్కర్ల మహా ప్రదర్శన
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కార్మికుల కష్టంతో నడుస్తున్న ప్రభుత్వాలు వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని, కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. ‘సమస్యలు పరిష్కరించం.. సమ్మెలు చేయొద్దని’ ప్రభుత్వాలు హుకుం జారీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల రెక్కల కష్టంతో తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, అదే వర్కర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. స్కీమ్‌ వర్కర్ల సమస్యలపై ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం ఎదుట నున్న ఎన్‌ఎస్పీ గ్రౌండ్‌లో కార్మిక మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి ఎన్‌ఎస్పీ గ్రౌండ్‌ వరకు మహాప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రౌండ్‌లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణు అధ్యక్షతన నిర్వహించిన సభలో పాలడుగు భాస్కర్‌ మాట్లాడారు. ఒక డిమాండ్‌ పరిష్కారం కోసం నాలుగు సమ్మెలు చేయాల్సి వస్తుందని తెలిపారు. చర్చలతో పరిష్కరిస్తాం, సమ్మెలు చేయొద్దంటున్న ప్రభుత్వం.. పోరాటాలు చేస్తే తప్ప సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కార్మిక హక్కులపై మోడీ, కేసీఆర్‌ దాడులు చేస్తున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికులకు నెలకు రూ. 21 వేల వేతనం ఇస్తున్నారని, తెలంగాణలో మాత్రం రూ.15000 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఒకే పనికి రెండు రాష్ట్రాల్లో వేర్వేరు వేతనాలు ఏంటని ప్రశ్నించారు. పాఠశాలల్లో శుక్రవారం నుంచి అల్పాహారం ఏర్పాటు చేసిన ప్రభుత్వం మధ్యాహ్నం భోజన కార్మికులపై అదనపు భారం మోపింది తప్ప ఆ మేరకు వేతనం పెంచడం లేదని అన్నారు. పోరాటంతోనే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అని అనుభవపూర్వకంగా తెలిసిందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో సత్తా చూపాలని పిలుపునిచ్చారు.
మొండిగా రాష్ట్ర ప్రభుత్వం: నున్నా నాగేశ్వరరావు
కార్మిక సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ కుటుంబానికి పదవులు వచ్చాయి కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని తెలిపారు. సీఐటీయూ పోరాటాలకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని స్పష్టంచేశారు. పోరాటాలు చేస్తే తప్ప ఏ సమస్యకూ పరిష్కారం లభించలేదని, ఏ ప్రభుత్వం కూడా దయతో సమస్యలు పరిష్కరించలేదన్నారు. డిమాండ్లు నెరవేర్చుకునేందుకు సీఐటీయూ సమ్మె చేస్తే అవి నెరవేరడంతోనే కేసీఆర్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి బీఆర్‌ఎస్‌ అనుకూల కార్మిక సంఘాల నేతలు పదవులు పొందుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌, జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీకాంత్‌, వై. విక్రమ్‌, రమ్య, నాయకులు నరసింహారావు, మంగమ్మ, జల్లా ఉపేందర్‌, బండారు యాకయ్య, బాణోత్‌ కమల, భూక్యా శ్రీను, పద్మా, దుగ్గి కృష్ణ, ప్రసాద్‌, గోపాల్‌, వేణు, ఏడుకొండలు, రాంబాబు, వెంకయ్య, నరేందర్‌, రాములు, కళ్యాణి, మురళి, యర్ర మల్లికార్జున్‌, పాపారాణి తదితరులు పాల్గొన్నారు.