తెలంగాణ ప్రజలతో బలమైన బంధం

– రాష్ట్రంలో బీజేపీకే అధిక సీట్లు : మాజీ గవర్నర్‌,బీజేపీ నేత తమిళి సై సౌందర రాజన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ప్రజలతో తనకు బలమైన బంధముందని మాజీ గవర్నర్‌, బీజేపీ నేత తమిళి సై సౌందర రాజన్‌ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధిక ఎంపీ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారతదేశం ముఖద్వారమైన తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారనీ, అందుకే ప్రధానిగా 22 సార్లు ఇక్కడ పర్యటించారని తెలిపారు. రాష్ట్రంలో తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏమైందని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తానంటున్న రేవంత్‌రెడ్డి ఆ ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందో చెప్పకపోవడం సరిగాదన్నారు. ౖ కేటీఆర్‌, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉందని తప్పుబట్టారు. టీఆర్‌ఎస్‌గా ఉన్నప్పుడు ఆ పార్టీ బలంగా ఉండేదనీ, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత వీక్‌గా మారిందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వలేదనీ, ప్రోటోకాల్‌ పాటించలేదని విమర్శించారు. అభివృద్ధిపై తనతో కనీసం చర్చించేవారు కాదన్నారు. తెలంగాణలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల ద్వారా కోట్లాది మంది లబ్దిపొందారని వివరించారు. మైనార్టీల సంక్షేమం కోసం కూడా ఎంతో చేసిందన్నారు.