– 9 మంది మృతి, 900 మందికి పైగా గాయాలు
– డజన్ల సంఖ్యలో గల్లంతు – పేకమేడల్లా కూలిన భవనాలు
హ్యులిన్ (తైవాన్) : గత 25ఏండ్లలో ఎన్నడూ లేని రీతిలో తైవాన్‌లో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదైన ఈ భూకంపంలో ఇప్పటివరకు 9 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. జాతీయ పార్క్‌కు వెళ్ళే దారిలో గల ఒక హౌటల్‌లో దాదాపు 50 మంది కార్మికుల ఆచూకీ గల్లంతయినట్లు అధికారులు భావిస్తున్నారు. మైనింగ్ ఏరియాలో మరో 80 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే వారు గని లోపల వున్నారా లేక బయటా అనేది వెంటనే తెలియరాలేదు. భూకంప తీవ్రతకు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భూకంప నాభి తూర్పు కౌంటీ హ్యులిన్‌లో వుంది. భూమిలోపల 15.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అందువల్ల ఈ ప్రాంతంలో విధ్వంసం తీవ్రత బాగా కనిపిస్తోంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో అందరూ పనులకు, పాఠశాలలకు వెళ్ళే హడావిడిలో వుండగా ఈ విపత్తు సంభవించింది. భవన శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. పలు చోట్ల పెద్ద మొత్తంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సబ్‌వే వ్యవస్థను మొత్తంగా ఖాళీ చేయించారు. హులెన్ నగరానికి సమీపంలో గల సొరంగాల్లో చిక్కుకున్న 70 మందిని కాపాడామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలను తొలుత జారీ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఉపసంహరించుకున్నారు. చైనా దక్షిణ ప్రావిన్స్ అయిన ఫ్యుజియాన్‌లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. తైపేలో ఇప్పటివరకు 50కి పైగా ప్రకంపనలు సంభవించాయి.