– ఆధిపత్యం నిలబెట్టుకునేందుకే దానిపై వ్యతిరేకత
– ద్వేషించినా, దూషించినా సరే…
– జీవ పరిణామ సిద్ధాంతం గొప్ప శాస్త్రం : ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య
– జేవీవీ తెలంగాణ ఆధ్వర్యంలో జీవ పరిణామ సిద్థాంత ప్రచారోద్యమం ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీవ పరిణామానికి బ్రహ్మాండమైన ఆధారాలున్నాయని జన విజ్ఞాన వేదిక సైన్స్ కమ్యూనికేషన్స్ కన్వీనర్, ఎన్‌ఐటీ (వరంగల్) ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య తెలిపారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చెలిమల రాజేశ్వర్‌రావు అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ”జీవ పరిణామ సిద్ధాంత ప్రచార కార్యక్రమం” ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో జేవీవీ గౌరవాధ్యక్షులు, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ దాసరి ప్రసాద్ రావు ప్రచారోద్యమ గోడపత్రికను విడుదల చేశారు. జేవీవీ రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ కట్టా సత్య ప్రసాద్ రచించిన ”దాచేస్తే దాగని సత్యం జీవ పరిణామం” పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు జీవ పరిణామ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఆధునిక దేశంగా చెప్పుకునే అమెరికాలోనూ ఈ పాఠాలు చెప్పకపోవడం అందుకేనని తెలిపారు. ఈ సిద్ధాంతం బోధించకుండా శాస్త్రీయ అధ్యయనానికి అర్థమే ఉండదని తెలిపారు. మన దేశంలోనూ పదవ తరగతి వరకు దీన్ని తీసేసే కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పబ్బం గడుపుకునేందుకే మత సిద్ధాంతాలని చెప్పారు. ప్రజల్లో సత్య దృక్పథం పెంచేందుకు వాస్తవాలను చెప్పాలని సూచించారు. పరిణామ వాదానికి వ్యతిరేకంగా సృష్టి వాదాన్ని కోటాను కోట్ల మంది నమ్ముతున్న సమయంలో చార్లెస్ డార్విన్ చెప్పిన సత్యంతో ప్రజలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.గెలిలియో సూర్య కేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించినప్పుడు, డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు…. వ్యతిరేకత ఎదురైనా వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. ప్రజల్లో శాస్త్ర ప్రచారం, మూఢ నమ్మకాలను తొలగించేందుకు జీవ పరిణామ సిద్ధాంతం గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా జీవ పరిణామ సిద్ధాంతం గొప్ప సైన్సు అని తెలిపారు. 1859 నవంబర్ 24 నాడు, చార్లెస్ డార్విన్ తన ప్రతిష్టాత్మక ” ఆరిజన్ ఆఫ్ స్పీసిస్” గ్రంథాన్ని ప్రచురించిన రోజని,అందువల్ల నవంబర్ 24 తేదీని ప్రపంచ పరిణామ దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుం టున్నామని తెలియజేశారు.డార్విన్ సిద్ధాంతాలపై నేటికీ ఆంక్షలు కొనసాగటం ఎంతో విచారకరమని అన్నారు. డాక్టర్ దాసరి ప్రసాద్‌రావు మాట్లాడుతూ ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో అనేక విప్లవత్మక పరిశోధనలకు, ఆవిష్కరణలకు మూలం డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతమని నొక్కివక్కాణించారు. అంతటి ప్రాధాన్యత కలిగిన జీవ పరిణామవాద సిద్ధాంతంపై జెవీవీ ప్రచార ఉద్యమాన్ని చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జీవ పరిణామ సిద్ధాంత విశేషాలను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని ఆయన కోరారు.
చెలిమల రాజేశ్వర్ మాట్లాడుతూ ఆరంభం నుంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం పలు మతాల ఆంక్షలను తట్టుకునీ, అనేక రుజువులతో నేటికీ నిలబడిందని గుర్తుచేశారు. తన ప్రఖ్యాత బిగిల్ ఓడ పర్యటన, తదనంతరం 20 సంవత్సరాలకుపైగా ఆయన చేసిన కఠోర అధ్యయనం, పరిశోధనల వల్లనే ఇంతటి మహత్తర జీవ పరిణామ సిద్ధాంతానికి రూపం ఇచ్చారని ఆయన కొనియాడారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, త్యాగాల వల్లనే సమాజం అభివృద్ధి చెందుతున్నదనీ, ప్రజల జీవితాలను మెరుగుపరిచే అటువంటి శాస్త్రవేత్తల కృషిని అడ్డుకోవడం తగదని ఆయన హితవు చెప్పారు.
సీసీఎంబీ రీసెర్చ్ స్కాలర్ ఆదిత్య మాట్లాడుతూ జీవులన్నిటి మధ్య సారూప్యం ఉందనీ, దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉదాహరణకు మనుషులపై వివిధ రకాల మందుల, వైద్య చికిత్సల ప్రభావాల గురించి అంచనా వేసేందుకు ముందుగా ప్రయోగశాలలో ఎలుకలపై, కోతులపై శాస్త్రవేత్తలు పరీక్షలు చేస్తారని గుర్తు చేశారు. జీవుల మధ్య, వాటి డీఎన్‌ఏ జన్యువుల మధ్య సారూప్యం ఉంది కాబట్టే శాస్త్రవేత్తలు ఇలాంటి పరిశోధనలు చేయగలుగుతున్నారని వివరించారు. కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పే పరిణామ సిద్ధాంత ప్రకటనను చాలా యాంత్రికంగా అర్థం చేసుకుంటున్నారనీ, దానివల్ల గందరగోళానికి లోనవుతున్నారని అన్నారు. ఈ శాస్త్ర ప్రకటన సరైన అర్థం, ఒకే ఉమ్మడి జీవి నుంచి కోతులు, మానవులు పరిణామం చెందాయని వివరించారు.జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా రాజా మాట్లాడుతూ శాస్త్రీయ అవగాహనను మన సమాజంలో, ప్రధానంగా విద్యార్థుల్లో పెంపొందించడానికి డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని జేవీవీ నిర్ణయించిందని తెలిపారు. నవంబర్ 24 నుంచి ప్రారంభించి 2025 ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం వరకు ఈ జీవపరిణామ సిద్ధాంత ప్రచారోద్యమానికి జేవీవీ పిలుపునిచ్చిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 1000 కి పైగా ఉపన్యాసాలు, సభలు, సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. అలాగే, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, డిబేట్, పోస్టర్ డిజైన్, క్విజ్, మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ప్రచారోద్యమాన్ని ప్రజలలోకి విస్తతంగా తీసుకువెళ్ళడం కోసం పుస్తకాలు, బుక్‌లెట్స్, పీపీటీ స్లైడ్స్, మొదలగు ప్రచార సామాగ్రిని సిద్ధం చేస్తున్నామన్నారు. జేవీవీ చేపట్టిన ఈ విస్తృత శాస్త్ర ప్రచార ఉద్యమానికి సహకరించాలని సైన్స్ ప్రియులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జేవీవీ రాష్ట్ర నాయకులు రావుల వరప్రసాద్, పి.ఆనంద్ కుమార్, జగన్మోహన్ రావు, ఎం.శ్రీనివాస్, రవీంద్రబాబు, ఎన్.శ్రీనివాసరావు, యు.సాయిబాబా, కురుమయ్య, లక్ష్మీనరసయ్య, ఎం రంగాచారి, రాములయ్య, అల్తాఫ్, చాగంటి సాయి తదితరులు పాల్గొన్నారు.