పటిష్టంగా చైనా-ఆఫ్రికా బంధం!

Strong China-Africa ties!మూడు రోజుల పాటు జరిగే చైనా-ఆఫ్రికా సహకార వేదిక సమావేశాలు బుధవారం నాడు బీజింగ్‌లో అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి.వర్తమాన భూభౌతిక రాజకీయాల్లో ఈ వేదిక 8వ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఆఫ్రికాలోని 54కు గాను 53దేశాల నుంచి ప్రభుత్వాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. తైవాన్‌ను చైనాగా గుర్తించిన ఒక చిన్నదేశం నుంచి రాలేదు. నేటి ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా దేశాలు ఒకనాడు చీకటి ఖండగా పిలిచిన ఆఫ్రికాను తమ ఉత్పత్తులకు మార్కెట్‌గా, తమ పరిశ్రమలు, గనులు,భూముల్లో పనిచేసేందుకు అక్కడి జనాలను బానిసలుగా పట్టుకువచ్చేందుకు అనువైన ప్రాంతంగా మాత్రమే చూసినట్లు చరిత్ర చెబుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1525 నుంచి 1866 వరకు నూతన ప్రపంచంగా వర్ణితమైన ప్రాంత దేశాలకు 125లక్షల మంది ఆఫ్రికన్లను బానిస లుగా తరలిస్తే ఆయా దేశాలకు చేరినవారు 107లక్షలు మాత్రమే, పద్దెనిమిది లక్షల మంది ప్రయాణాల్లో మరణించారు. చరిత్రలో మరికొన్ని చోట్ల బానిసల గురించి ప్రస్తావన, ఉనికి ఉన్నప్ప టికీ ఇంత పెద్దఎత్తున తోటి మానవులను పశువుల కంటే హీనంగా చూసిన దారుణం మరొకటి లేదు. వర్తమానంలో బానిసలుగా చేసుకొనే అవకాశం లేదు గనుక పశ్చిమదేశాలు ఇప్పటికీ ఆఫ్రికాను మార్కెట్‌గానే చూస్తున్నాయి.అందుకే అక్కడ అభివృద్ధి లేదు.
ఈ శతాబ్ది ప్రారంభంలో చైనా చొరవతో సహకార వేదిక ఉనికిలోకి వచ్చిన తరువాత తమనెక్కడ ఆఫ్రికన్లు పూర్తిగా విస్మరిస్తారో అన్న భయంతో పశ్చిమదేశాలు కొంతమేరకు తమ మూటలు విప్పుతున్నాయి. అయితే చైనాతో వాణిజ్య లావాదేవీలు, పెట్టుబడుల పెరుగుదల చూసిన తరువాత వాటికి ” రాజకీయ” భయం పట్టుకుంది.చైనాను అడ్డుకొనేందుకు సామ,దాన,బేధ,దండోపాయాలను ప్రయోగిస్తున్నాయి. 2000 సంవత్స రాలో ఉనికిలోకి వచ్చిన చైనా-ఆఫ్రికా సహకార వేదిక ప్రతి మూడేండ్లకు ఒకసారి శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి భవిష్యత్‌ కార్యక్ర మాలను నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు బీజింగ్‌లో ప్రారంభమైన ఎనిమి దవ సమావేశం కూడా అదే చేయనుంది. ఈ వేదిక సాధనంగా ప్రపంచంలోని పేద దేశాలకు చెందిన 280కోట్ల మంది జీవితాలను నవీకరించవచ్చని సమావే శాలను ప్రారంభించిన చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ చెప్పారు. చైనా-ఆఫ్రికా రెండూ సామ్రాజ్య వాదుల దురాక్రమణ, వలసవాదానికి వ్యతిరేకం గా పోరాడినవే అని గుర్తు చేశారు. చైనాతో పెట్టుకున్న దేశాలన్నీ రుణ ఊబిలో చిక్కుకుపోయి చివరికి దాని చేతిలో బందీలుగా మారిపోవాల్సి ఉంటుందని సామ్రాజ్యవాద దేశాలు, వాటి కనుసన్నలలో పనిచేసే మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నది.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదని గ్రహించిన వారు మార్కెట్లను ఆక్రమించు కొనేందుకు నయావలస విధాన సాధనాలుగా ఐరాస, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థలను ముం దుకు తెచ్చారు. అవేవీ పేద,వర్ధమానదేశాలను ఉద్దరించేవి కాదని ఎనిమిది దశాబ్దాల అనుభవం నేర్పింది. వాటి విధా నాల పర్యవసానమే లాటిన్‌ అమెరికా, ఇతర అనేక దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి, సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల్లో ఇరుక్కోవటం తెలిసిందే. దానికి వ్యతిరేకంగా తలెత్తిన పోరాటాలను అణచేందుకు మిలిటరీ, మితవాద నిరంకుశ శక్తులను రుద్ది ప్రజాస్వామ్యాన్ని కూడా హరించటం దాస్తే దాగేది కాదు. ఇప్పటి వరకు తాను పెట్టుబడులు పెట్టిన లేదా రుణాలిచ్చిన దేశాల్లో అలాంటి శక్తులను చైనా ప్రతిష్టించిన లేదా పనిగట్టుకొని సమర్ధించిన దాఖలాలు లేవు.
చైనా పెట్టుబడులు లేదా వాణిజ్య లావాదేవీలను చూపి వాటికి లంకె పెడుతూ కొందరు కుట్ర సిద్దాంతాలను ముందు కు తెస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం ఆఫ్రికా దిగుమతి చేసుకుంటున్నవాటిలో చైనా వాటా 16శాతం కాగా దానికి చేస్తున్న ఎగుమతులు పాతికశాతం ఉన్నాయి.
ఎవరు లబ్ది పొందుతున్నట్లు? నరేంద్రమోడీ సర్కార్‌ చైనా నుంచి రుణాలు గానీ పెట్టుబడులు గానీ స్వీకరించకుండానే భారీ ఎత్తున చైనా నుంచి దిగుమతులు ఎందుకు చేసుకుంటున్నట్లు? వంద బిలియన్‌ డాలర్ల విదేశీ మారకద్రవ్యం చైనాకు ఎందుకు సమర్పిస్తున్నట్లు ? అమెరికా, ఐరోపాదేశాలన్నీ చేస్తున్నదేమిటి ? చైనా తయారీ వస్తువులు లేకపోతే వాటికి పూడగడవటం లేదు కదా! అమ్మ పెట్టదు-అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా దశాబ్దాల తరబడి పెట్టుబడులు లేదా సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి పశ్చిమ దేశాలు ముందుకు రాలేదు కనుకనే ఆఫ్రికా నేడు చైనా వైపు చూస్తున్నది.రానున్న పది సంవత్సరాల్లో చైనా-ఆఫ్రికా సహకారం మరింతగా విస్తరించేందుకు బీజింగ్‌ సభ బాటలు వేస్తున్నది. దాన్ని అడ్డుకోవటం ఎవరితరమూ కాదు!