– ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
అన్ని రంగాలలో మహిళాల సమానత్వం కోసం బలమైన పోరాటాలు నిర్మించాలని ప్రగతి శీల మహిళా సంఘం (పివోడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ అన్నారు. శనివారం నగరంలో ద్వారకానగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో పివోడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా 7వ మహాసభ నిర్వహించారు. ముందుగా పివోడబ్ల్యూ జెండాను జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చాయని, కానీ నేడు ప్రభుత్వాలు మహిళా చట్టాలను అమలు చేయటం లేదని అన్నారు. కోట్లాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు వెనక్కి తీసుకోపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుండా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు చేస్తున్నారని వాటిని అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
33 శాతం మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలని, మత్తు పదార్థాలు, మద్యానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో విప్లవాత్మక మార్పు కోసం మహిళలు చైతన్యవంతమై, బలమైన పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో వక్తలుగా వచ్చిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, పివోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిట్ల సరితలు మాట్లాడుతూ.. ఆటవిక యుగం నుంచి సమాజ పరిణామ క్రమంలో అభివృద్ధిలో మహిళా పాత్రే కీలకమన్నారు. నేటికీ మహిళలు ప్రాధాన్యత ఉంటే మహిళ పథకాలు, మహిళల చుట్టూ రాజకీయాలు, దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారో అర్ధం అవుతుందని తెలిపారు. ఈ సభకు అధ్యక్షత పివోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ వహించారు. ఈ సభలో పివోడబ్ల్యూ నగర అధ్యక్ష, కార్యదర్శులు నీలం లక్ష్మి, జి.సంజన, పద్మ, చిట్టెక్క, వెల్పూర్ లక్మి, అనంతక్కా, భారతి, డిశెట్టి రాధ, పుష్పాలత, అనురాధ శైలజ, 100 మంది మహాసభ ప్రతినిధులు, పాల్గొన్నారు.