నవతెలంగాణ – కరీంనగర్
అర్హులైన వారికి ఇండ్లు, స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శనివారం మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల వేదిక బాధ్యులు గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇస్తామని, సొంత ఇంటి స్థలం ఉన్న వారికి 5లక్షలు ఇస్తామని పేదలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ 9సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయడం లేదని విమర్శించారు.
కరీంనగర్ నియోజకవర్గంలో 5,729 ఇండ్లు మంజూరు కాగా, 58 మాత్రమే పూర్తి చేశారని అవి కూడా పేదలకు కేటాయించలేదని అన్నారు. ఇండ్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.10లక్షలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పేదలకు ఇవ్వకుంటే తాళాలు పగలగొట్టి ఆక్రమిస్తామని హెచ్చరించారు. అనంతరం అడ్మినిస్ట్రేషన్ అధికారికి అర్హులైన పేదలతో దరఖాస్తులు, వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఉపాధ్యక్షుడు గుడికందుల సత్యం, రైతు సంఘం ఉపాధ్యక్షులు శీలం అశోక్, సంపత్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కవ్వంపల్లి అజరు, వడ్ల రాజు, ఉపాధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.భీమాసాహేజ్, ఐద్వా జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపాధ్యక్షులు యముప, లావణ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొంపల్లి సాగర్, తిప్పారపు సురేష్, గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్‌యాదవ్ పాల్గొన్నారు.
పోరాడితేనే ఇంటి స్థలాలు; సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి/ó పెంట్లవెల్లి
తెగించి పోరాటాలు చేస్తేనే పేదలకు గుడిసె జాగాలు వస్తాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిలో మహంకాళి అమ్మమిట్ట పరిధిలో పేదలు వేసుకున్న గుడిసెల జాగాలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేయగా.. శనివారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయాయని విమర్శించారు. 20ఏండ్ల కిందట పేదల కోసం పాలకులు కేటాయించిన భూములకు నేటికీ పట్టాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వందల ఎకరాల భూములు పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్న పాలకులు.. పేదలు 100 గజాల స్థలాన్ని అడిగితే ఎందుకివ్వరని ప్రశ్నించారు.
మహంకాళి అమ్మమిట్ట దగ్గర 14 ఎకరాల భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్నారని, వారికి పట్టాలు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని చెప్పారు.పెంట్లవెల్లిలో 22,27 సర్వే నెంబర్లలో 14 ఎకరాల 36 గంటల భూమిని రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్ల స్థలాల కోసం కొన్ని ఏండ్ల కిందట కొనుగోలు చేసి నేటికీ పంచకపోవడం దుర్మారగమన్నారు. 125 గజాల ఇంటి స్థలం ఇచ్చి.. ఇంటి నిర్మాణానికి రాష్ట్రం రూ.5లక్షలు, కేంద్రం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు, కందికొండ గీత, పెంట్లవెల్లి మండల కార్యదర్శి ఈశ్వర్, కొల్లాపూర్ మండల కార్యదర్శి శివవర్మ తదితరుల పాల్గొన్నారు.