పోరాటమే వాహికగా!

పోరాటమే వాహికగా!ఏది మంచిరోజు కాదు! ఏది చెడ్డరోజు కాదు!
దేని విలువ దానికుంటుంది!
అది పాఠమైనా! గుణపాఠమైనా!
ఏదొకటి తప్పక బోధిస్తుంది నీ జీవిత ప్రయాణంలో
కొన్ని పనులు వెంట వెంటనే జరుగవచ్చు!
కొన్నింటికి కొంత సమయం పట్టవచ్చు! కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు!
కొన్ని ఎందుకు వచ్చాంరా దేవుడా..? అనిపించవచ్చు!
కాని, ఏ పనియైనా కచ్చితంగా
ఎలాగైనా ఏదో విధంగానైనా జరిగితీరుతుంది!
జరగని పని అనేదే లేదు!
కాకపోతే, సరైన మార్గం దొరకక కాస్త ఆలస్యం కావచ్చు!
కొందరు సహకరించొచ్చు! కొందరు ఇబ్బంది పెట్టవచ్చు!
కొందరు దూరం కావచ్చు! కొందరు తప్పుగా అనుకోవచ్చు!
ఒకటి మాత్రం నిజం! కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది!
మంచికి అందలం! చెడుకు పాతాళం!
ఏదైనా ఈ కలియుగంలో వెంట వెంటనే జరుగుతాయి!
దానికి ఎవరూ మినహాయింపు కాదు!
వడ్డితో సహా అందరి రుణం తీర్చుకుంటుంది కాలం!
పట్టు వదలక లక్ష్యాన్ని మరవక
నీ శ్వాస ధ్యాస ఆ పని మీదనే దష్టి పెట్టినంతవరకు
నీ ‘విజయాన్ని’ ఏ ఉపద్రవం ఆపలేదు! సరికదా
ఏ మానవ దానవులు నిలువరించలేరు!
పట్టుదలకు ఆ శక్తి ఉంది! ఓపికనే నీ ఆయుధం!
సహనమే నీ బలం! నమ్మకమే నీ పెట్టుబడి!
ఆత్మవిశ్వాసమే నీ ధైర్యంగా ముందుకు సాగిపో
ప్రకతే నీకు తోడుగా! కాలమే నీకు ఆసరాగ!
నీ నిజాయితే నీకు అండగా! నీ పోరాటమే వాహికగా!
నిలిచి, శ్రీశ్రీ గారన్నట్లు ‘విజయం’ తానంతట తానై నీ దరికి వస్తుంది..!!!
– నానాపురం నర్సింహులు (నా న)