
నవతెలంగాణ-గోవిందరావుపేట : ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఒక్కటే మార్గమని సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలో సుందరయ్య నగర్ లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎంతోమంది ప్రజలు నివాస స్థలము ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత 25 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా ఈ విషయం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత జఠలమైందని అన్నారు. ఏ గ్రామంలో చూసిన ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అంతేకాక ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని, ఇప్పటికైనా ఇందిరమ్మ గృహాలు అర్హులైన వారికి అందించాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ సరైన రహదారులు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు పారిశుధ్యంలో మగ్గి అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12న తాసిల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో ప్రజల వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.