దేశ ప్రజాస్వామ్య, లౌకిక స్వభావాన్ని కాపాడేందుకు పోరాటాలు

– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
– ‘జ్యోతిబసు సెంటర్‌ ఫర్‌ సోషల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌’ భవనానికి శంకుస్థాపన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ ప్రజాస్వామ్య, లౌకిక స్వభావాన్ని కాపాడేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కమ్యూనిస్టు నేత, ప్రజా నాయకుడు జ్యోతిబసు 15వ వర్ధంతి సందర్భంగా బుధవారం జ్యోతిబసు నగర్‌ (న్యూటౌన్‌)లో ‘జ్యోతిబసు సెంటర్‌ ఫర్‌ సోషల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌’ భవనానికి శంకుస్థాపన చేశారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం, లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మెన్‌ బిమన్‌ బోస్‌, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు సూర్యకాంత్‌ మిశ్రా, రామచంద్రడోమ్‌ తదితరులు జ్యోతిబసు స్మృతికి నివాళులర్పించారు. అనంతరం నేతలంతా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ సందేశం పంపారు. అలాగే నోబెల్‌ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ, ఆర్థికవేత్తలు అమియా బాగ్చి, ప్రభాత్‌ పట్నాయక్‌, జర్నలిస్టు పి. సాయినాథ్‌ సందేశాలను పంపారు.
‘లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణలో సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. లౌకిక ప్రజాస్వామ్య భారతదేశాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ”జ్యోతిబసు కలలుగన్న భారతదేశానికి వ్యతిరేకంగా దేశం నడుస్తోంది. జనవరి 22న సంఫ్‌ు పరివార్‌ స్వతంత్ర భారత చరిత్రలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తుంది. రామ మందిరాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది. ప్రజల విశ్వాసాలతో రాజకీయం చేస్తుంది. ఇది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం. అయినా రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా చర్యలకు ఉపక్రమిస్తుంది” అని విమర్శించారు. యూఏపీఏ, ఈడీ, సీబీఐ వ్యతిరేకిస్తే ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నారని విమర్శించారు. మహ్మద్‌ సలీం మాట్లాడుతూ ప్రస్తుతం విద్య, చరిత్రపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పరిశోధనల కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రం వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై పని చేస్తుందని ఆయన చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు రెండూ ఏకకేంద్ర పాలనా వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. కేంద్రీకరణకు వ్యతిరేకంగా వికేంద్రీకరణ ధ్యేయంగా జ్యోతిబసు నాయ కత్వంలో రాష్ట్రం నడిచిందని గుర్తు చేశారు.
రాజ్యాంగ సంస్థల పరిరక్షణలో జ్యోతిబసు కీలక పాత్ర: పినరయి విజయన్‌
అనంతరం సమావేశాన్ని ట్రస్టు చైర్మెన్‌ బిమన్‌ బసు ప్రారంభిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు.
ప్రధాని కేరళ పర్యటన కారణంగా విజయన్‌ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు. విజయన్‌ తన సందేశంలో జ్యోతిబసు రాజకీయ జీవితం నుండి పాఠాలు నేర్చుకోవాలని, వర్తమానానికి దిశానిర్దేశం చేయాలని పేర్కొన్నారు. దివంగత జ్యోతిబసు రాజకీయ జీవితాన్ని ప్రస్తావిస్తూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత బెంగాల్‌లో మతపరమైన హింసాత్మక సంఘటనలు జరగకుండా నిరోధించడంలో జ్యోతిబసు పాత్రను వివరించారు. ఇందిరాగాంధీ మరణానంతరం దేశమంతా అల్లర్లు చెలరేగినప్పుడు, బాబ్రీ విధ్వంసం తరువాత దేశమంతటా మతోన్మాద విషంవ్యాపించి నప్పుడు బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు వాటిని అడ్డుకున్నారని కేరళ ముఖ్య మంత్రి సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క మత హింసాకాండ జరగడానికి అనుమతిం చలేదని గుర్తు చేశారు. రాజ్యాంగ సంస్థలను పరిరక్షిం చడంలో ఆయన కీలక పాత్ర పోషిం చారని తెలిపారు.
జ్యోతిబసు మాకు రోల్‌ మోడల్‌: నితీష్‌ కుమార్‌
అనంతరం బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పంపిన సందేశాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీమ్‌ చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోవడానికి గురుగోవింద్‌ సింగ్‌ జన్మదిన వేడుకలు కారణమని నితీష్‌ తన సందేశంలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు నాయకత్వంలో పంచాయతీరాజ్‌, వెనుకబడిన ప్రజల సాధికారత గురించి ఆయన తన సందేశంలో ప్రస్తావించారు. బెంగాల్‌ ముఖ్యమంత్రిగా జ్యోతిబసు గ్రామాల అభివృద్ధికి, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి త్రిస్టార్‌ పంచాయతీని నిర్వహించి యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. జ్యోతిబసు మాకు రోల్‌ మోడల్‌ అని తెలిపారు. నోబెల్‌ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ, ఆర్థికవేత్తలు అమియా బాగ్చి, ప్రభాత్‌ పట్నాయక్‌, జర్నలిస్టు పి సాయినాథ్‌ పంపిన సందేశాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు దేబాషిస్‌ చక్రవర్తి చదివి వినిపించారు.