– ఏళ్ల నుండి సేవలు అందిస్తున్నా గుర్తింపు లేదా
– బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు కార్పొరేషన్ పదవులు
– పట్టింపు లేని జిల్లా మంత్రి
నవతెలంగాణ – సిద్దిపేట
ఏళ్ల నాటినుండి పార్టీ పట్టుకొని సేవలందిస్తున్న… అధిష్టానం చెప్పిన కార్యక్రమాలను నిర్వహించిన… బీఆర్ఎస్ కు కంచుకోటైన సిద్దిపేటలో కాంగ్రెస్ ను బతికించడానికి కృషి చేస్తున్న పార్టీ తమను గుర్తించలేదని, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించడం లేదని సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నాయకులతో, పదవులు ఆశిస్తున్న వారితో ఇప్పటివరకు ప్రత్యేక సమావేశాలు పెట్టలేదు. దీంతో జిల్లా పై అతనికి పట్టింపు లేదా అన్న ఆలోచనలు, అనుమానాలు కలుగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యము వహిస్తున్న జిల్లాలో వారిని తట్టుకొని, కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి ఎందరో నాయకులు ఉన్నప్పటికీ, కార్పొరేషన్ పదవుల్లో కానీ, స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీలు, ఇతర కమిటీల నియామకంలో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం పై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. పదవులు ఆశించిన వారు ఎంపీ ఎన్నికలలో మనస్ఫూర్తిగా పనిచేస్తారో లేదో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి పార్టీకి సేవలు అందిస్తున్న వారికి నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో కార్పోరేషన్ పదవులు: తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ వెంట ఉన్న నాయకులకు కార్పొరేషన్, స్థానిక కమిటీలలో పదవులు ఇచ్చి వారిని గుర్తించారు బి ఆర్ ఎస్ అధినేత కేసిఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావులు. రాష్ట్రస్థాయిలో సుమారు 8 మందికి వరకు కార్పోరేషన్ పదవులు దక్కాయి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ కానీ, స్థానిక కమిటీలలో పదవులు ఇవ్వడంలో అంతగా చొరవ చూపడం లేదని తెలుస్తుంది.
పార్టీ విస్తరించాలంటే పదవులు ఇవ్వాల్సిందే: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ లో మినహా బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తరించాలన్న, జరగబోయే ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించాలన్న కష్టపడ్డ నాయకులను గుర్తించి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చేర్చుకున్న వారికి పదవులు ఇస్తే కష్టమే: ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉండి సేవలు అందిస్తున్న వారిని కాకుండా, ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తే సీనియర్ కాంగ్రెస్ నాయకులు పనిచేయడం కష్టమే అని చెప్పవచ్చు. పార్టీని వీడకున్నా పార్టీ గెలుపు కోసం కృషి చేయడంలో నిశ్శబ్దంగా ఉంటారని తెలుస్తుంది. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లావ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖ నాయకులతో ఇప్పటివరకు సమావేశాలు ఏర్పాటు చేయకపోవడంపై కొంతమంది నాయకులు నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా మంత్రి ఎంపీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభించడానికి ముందే పార్టీకి సేవలు అందించిన వారికి పదవులు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అధికారంలోకొచ్చి నాలుగు నెలలు అయినా ఎందుకు అధిష్టానం ఆలస్యం చేస్తుందో, నిర్ణయం తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధిష్టాన నిర్ణయం కోసం ఆశావాహులు వేసి చూడాల్సిందే.