మైనార్టీలకు మొండి చెయ్యే..

Stubborn to minorities..– అభ్యర్థుల ఎంపికలో జాప్యం.. విధివిధానాలపై గందరగోళం
– కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే రుణాలకు మెలిక
– లక్షతో సరిపెట్టే యోచన
– పాత దరఖాస్తులే పరిశీలన..
– కొత్తవారికి అవకాశమే లేదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
”ఎస్సీ, ఎస్టీ వర్గాల మాదిరిగానే మైనార్టీల్లో కూడా పేదరికం ఉంది. ముస్లింలు, ఇతర మైనార్టీల జీవితాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం ఆచరణాత్మక విధానం అమలు చేస్తున్నది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే విషయంలో ఎస్సీ, ఎస్టీల పట్ల ఎంత ఉదారంగా ఉంటుందో, మైనార్టీల విషయంలో కూడా అలాగే ఉండాలని నిర్ణయించింది”.ఇది ప్రభుత్వం చెబుతున్న మాట..
కానీ..ఆచరణ అందుకు భిన్నంగా ఉందంటూ ముస్టిం మైనార్టీలు వాపోతున్నారు. తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్‌లో ఇప్పటికే సుమారు 3,60,000మంది స్వయం ఉపాధి లక్ష్యంగా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో చిరువ్యాపారులు, ఆటో, క్యాబ్‌, మెకానిక్‌, స్ట్రీట్‌ వెండర్లు, హాకర్లు తదితర వ్యాపారాల కోసం లబ్దిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని పరిశీలించి, అర్హత కలిగిన వారికి తగిన రుణం అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. వార్షిక బడ్జెట్లో కేటాయించిన నిధులను అధిక భాగం మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఖర్చు పెట్టాలి. కానీ.. నిధుల కేటాయించిన వాటికి , ఖర్చుకు పొంతన లేకుండా ఉంది. తొమ్మిదేండ్లలో మైనార్టీ సంక్షేమానికి బడ్జెటలో రూ.12,932 కోట్లు కేటాయించగా.. ఇందులో ఖర్చు చేసింది మాత్రం సుమారు రూ.6వేల కోట్లు మాత్రమే. బ్యాంకు సబ్సిడీ లోన్ల కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 8,500మందికి శాంక్షన్‌ లెటర్లు ఇవ్వగా, అందులో 4వేల మందికి బ్యాంకులు పెండింగ్‌లో పెట్టాయి. మిగిలిన 4,500మందికి మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కార్పొరేషన్‌ రుణాలకు చెక్‌పెట్టినట్టేనా?
మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో బ్యాంకు సబ్సిడీ రుణాల కోసం లక్షల కొద్ది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని క్లియర్‌ చేయకుండా తిరిగి మైనార్టీలకు రూ.లక్ష సాయం పథకాన్ని ప్రకటించటంతో లక్షతో సరిపెట్టి ఉపాధి అవకాశాల కోసం గతంలో పెట్టుకున్న దరఖాస్తులను బుట్టదాఖలు చేయనున్నారా? అన్న అనుమానాలు ముస్లీం మైనార్టీలు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే..ఇక మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు చెక్‌ పెట్టినట్టేనని చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. రూ. లక్ష సాయంకోసం ముస్లిం మైనార్టీలు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. గతంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారినే అర్హులుగా ప్రకటించిన నేపథ్యంలో ఇది పలు రకాల చర్చలకు దారితీస్తున్నదని తెలుస్తున్నది.
అర్టీలకు అవకాశం లేక ఇబ్బంది..
ముస్లిం మైనారిటీల విషయంలో రుణాలు కిందటేడు దరఖాస్తులు చేసుకున్నవారికే ఇవ్వనుండడంతో కొత్తవారు దరఖాస్తులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో కొత్త వారు రూ.లక్షసాయం అందే అవకాశం లేదు. కిందటేడు వివిధ కారణాల వల్ల దరఖాస్తులు చేసుకోని వారు.. తాజాగా అర్జీలు పెట్టుకునేందుకు వీలు కల్పిస్తే అర్హులైన మరికొందరు సాయం అందుకోగల అవకాశం కూడా ఉంటుంది. కానీ..ఆ అవకాశం లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. క్రిస్టియన్‌ మైనారిటీల విషయంలో కొత్తగా దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. గానీ.. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించేది ఎప్పుడు? సాయం పంపిణీ చేసేది ఎప్పుడు? అని మైనారిటీలు వాపోతున్నారు.
అధికారుల ఆందోళన..
ముస్లింలు ఆర్థిక సాయం కోసం కిందటేడు భారీ సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్‌ మైనారిటీలు కూడా అదేస్థాయిలో దరఖాస్తులను దాఖలు చేశారు. ఇచ్చేది కొద్ది మందికి.. దరఖాస్తులేమో వెల్లువలా వచ్చాయి. సాయం పంపిణీ ఎలా చేయాలో తెలియక మైనారిటీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా తక్కువే. ఇదివరకు స్వయం ఉపాధి కోసం రాయితీ రుణాలు అందిస్తామన్న ప్రభుత్వం.. కొత్తగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో ఇక బ్యాంకులతో సంబంధం లేకుండా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలోనే పంపిణీ జరుగనున్నది. దీంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని మైనారిటీల్లో ఒక పక్క హర్షం వ్యక్తం చేస్తున్నా సాయం అందే విషయంలోనే వారిని పలు సందేహాలు వెంటాడుతున్నాయి.
120 యూనిట్లే..
నియోజకవర్గానికి 120 యూనిట్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతి తక్కువ మందికి మాత్రమే అందే అవకాశం ఉంది. దీంతో ఇవి ఏ మాత్రం సరిపోవని మైనారిటీలు వాపోతున్నారు. ఎనిమిదేండ్లుగా మైనార్టీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ రుణాలు అందలేదు. రుణాలు ఇస్తున్నట్టు ప్రకటనలు చేయడం, దరఖాస్తులు స్వీకరించడం, నిధులు మాత్రం కేటాయించకపోవడంవల్ల అర్హులైన నిరుపేద మైనారిటీ యువత ఎలాంటి ఆర్థిక సాయం పొందలేకపోయారు. ఆయా సందర్భాల్లో కొందరు పొందినా వారి సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్ట వచ్చు. తమ జనాభా ప్రాతిపదికగా చూసినా నియోజకవర్గానికి కనీసం 300 మంది లబ్ధిదారులకు సాయం అందించాల్సిన ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
రూ. లక్ష సాయం కోసం ఎదురు చూపు..
మైనార్టీలు రూ.లక్ష ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దళితులు దళిత బంధు పథకం కింద రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం పొందుతున్నారు. చేతివృత్తుల కులాలకు సంబంధించి రూ.లక్ష ఆర్థిక సాయం బీసీలు పొందుతున్నారు. ఈ క్రమంలో తమకు ఇంకా రుణ సాయ వితరణ మొదలు కాకపోవడంపై మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు. 2023 మార్చి నెలాఖరులోగానే యూనిట్లను కేటాయించాల్సి ఉన్నా జాప్యం జరుగుతోంది.రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 46లక్షల మంది మైనార్టీలున్నారు.ఇందులో ముస్లింలు, బుద్ధిస్టులు, జైనులు, సిక్కులు, పార్శీల తెగలకు చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారులను ఆయా నియోజక వర్గాల్లో ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారోననీ, అందులో మా పేర్లు ఉంటాయో, లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిపొందే అభ్యర్థులకు తెల్లరేషన్‌ కార్డు సహా వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ పరిధిలో రూ.2లక్షలు ఉండాలనేది ప్రాథమిక నిబంధన. అయితే కుల, చేతి వృత్తుల వారికి విధించినట్లుగా ఈ మైనారిటీ సాయంపై అలాంటి నిబంధనలేవి విధించలేదు.కానీ..ఆచరణ కనుచూపు మేరలో లేకపోవడంతో పథకం లక్ష్యం నెరవేరుతుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు