వైద్యారోగ్య రంగానికి మొండిచేయి

– రాష్ట్ర బడ్జెట్‌పై టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి మొండిచేయి చూపించిందని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ) విమర్శించింది. ఈ మేరకు యూనియన్‌ గౌరవాధ్యక్షులు భూపాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యారోగ్య రంగానికి కేటాయించిన రూ.11,468 కోట్లు జీతాలకు కూడా సరిపోవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 10 శాతం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ శాఖ పరిధిలో పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ తదితర పేర్లతో లక్షన్నర మందికిపైగా ఉద్యోగులు సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రతి 20 వేల మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలనీ, రాష్ట్రంలో 1,750 కేంద్రాలు అవసరముండగా కేవలం 885 మాత్రమే ఉన్నాయని తెలిపారు. వీవీపీ పరిధిలో 179 ఆస్పత్రులు, డీఎంఈ పరిధిలో 34 మెడికల్‌ కాలేజీలు, 15 టీచింగ్‌ హాస్పిటళ్లతో పాటు ఎన్‌హెచ్‌ఎం, 104 ఎఫ్‌ డీహెచ్‌ఎస్‌, 108 ఎమర్జెన్సీ, 102, తదితర పథకాలు అమల్లో ఉన్నాయని చెప్పారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతుం డటంతో రాబోయే కాలంలో కార్మికులు, ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ఇంతటి కీలకశాఖకు బడ్జెట్‌లో 3.9 శాతం, జీఎస్డీపీలో 0.7శాతం కేటాయిస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించలేదని ఆక్షేపించారు. స్కీంలలో పని చేస్తున్న వారిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, ఉద్యోగుల పీఆర్సీపై స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ హెచ్‌ఎంలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎం, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఏఎన్‌ఎంలు, హెచ్‌ఆర్‌డీ ఏఎన్‌ఎంల రెగ్యులరైజేషన్‌ను పట్టించుకోలేదని తెలిపారు.
ఏఎన్‌ఎంల బకాయి వేతనాలు రూ.33 కోట్లకు పెరిగినా బకాయిలు చెల్లించలేదని గుర్తుచేశారు. ఎన్‌ హెచ్‌ఎంలో 17 వేల మందిలో నాలుగు వేల మందికి ఆరు సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ తెచ్చిన 104 సేవలను బీఆర్‌ఎస్‌ సర్కారు రద్దు చేసింది. ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. దాదాపు 800 మంది ఆరోగ్యమిత్రలకు 4వ తరగతి వేతనాలు ఇస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. వారికి జీవో 60 ప్రకారం రూ.22,750 వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని టీచింగ్‌ హాస్పిటల్స్‌, జనరల్‌ హాస్పిటల్స్‌ వైద్య విధాన పరిషత్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్న పేషంట్‌ కేర్‌, శానిటేషన్‌, సెక్యూరిటీ గార్డులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15,600 నిర్ణయించి కాంట్రాక్టర్ల ద్వారా రూ.11,000 మాత్రమే చెల్లిస్తుందన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ, జీతభత్యాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టి సాక్స్‌, మలేరియా, ఫైలేరియా, టిబి తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బడ్జెట్‌లో ఆసక్తి చూపలేదని విమర్శించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను వైద్యారోగ్యశాఖలో విలీనం చేస్తామని గతంలో ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటనను బడ్జెట్‌ ప్రసంగంలో విస్మరించారని తెలిపారు. వీవీపీలో పని చేస్తున్న వేల మంది పర్మినెంట్‌ ఉద్యోగులకు కూడా హెల్త్‌ కార్డులు, పదోన్నతులు లేవని తెలిపారు. నర్సింగ్‌ ఆఫీసర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో ఇబ్బందులు తొలగించాలనీ, 142 జీవో రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖలోని సమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్‌ చేశారు.