ఓయూలో విద్యార్థుల ఆందోళన

– యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి
– పరిపాలనా భవనం వద్ద ముళ్లకంచెలు, బారికేడ్ల తొలగింపునకు యత్నం
– విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్‌
నవతెలంగాణ-ఓయూ
హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో పరిపాలనా భవనం వద్ద ముండ్లకంచెలను, బారీకేడ్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం ఓయూ లైబ్రరీ నుంచి వందలా మంది విద్యార్థులు ర్యాలీగా పరిపాలన భవనం వద్దకు చేరుకొని ధర్నా చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ముండ్లకంచెలు తొలగించేందుకు యత్నించారు. పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లా డుతూ.. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఓయూలో వీసీ ప్రొ.రవీందర్‌ నియంతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వేదికైన ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రాంగణంలో సభలు, సమావేశాలు పెట్టుకోకుండా ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా అన్ని కోర్సుల ఫీజులు పెంచి పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువును దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే యూనివర్సిటీలో మౌలిక వసతులు, పూర్తిస్థాయిలో శాశ్వత ప్రొఫెసర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పరిపాలన భవనం చుట్టూ ముండ్లకంచెలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా యూనివర్సిటీలో పనిచేసిన కార్మికులను తొలగించి ఆ స్థానంలో బి సెక్యూర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వీసీ విద్యార్థులను కలవకుండా నియంతలా వ్యవహరిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు ముండ్లకంచెలు, బారీకేడ్లను తొలగించాలని విన్నవించుకున్నా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు రీసెర్చ్‌, స్కాలర్స్‌ భారీ ర్యాలీతో వెళ్లి వాటిని తొలగించే ప్రయత్నం చేసినట్టు చెప్పారు. పరిపాలన భవనం వద్ద ముండ్లకంచెలను, బారీకేడ్లను తొలగించే వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, సాయంత్రం ఓయూ ఏసీపీ చొరవతో విద్యార్థులు వీసీ ఛాంబర్‌లో వీసీతో భేటీ అయ్యారు. వారి డిమాండ్‌లను వీసీ ముందు ఉంచారు.