ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

– విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-ఆత్మకూర్‌(ఎస్‌)
ఉపాధ్యాయులు మందలించారని మనస్తాపానికి గురైన విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ ఎస్‌ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న, జయలక్ష్మీ దంపతుల కుమారుడు రాకేష్‌ మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ రెసిడె న్షియల్‌ పాఠశాలలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి హాస్టల్‌ గదిలో లైట్లు వేసి ఉన్నాయని పాఠశాల ఉపాధ్యాయులు రాకేష్‌తోపాటు మరో ఐదుగురు విద్యార్థులను మందలించారు. దాంతో మనస్తాపానికి గురైన రాకేష్‌ బుధవారం రాత్రి హాస్టల్‌ పాత మరుగుదొడ్ల వద్ద రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున తోటి విద్యార్థులు నిద్ర లేచే సరికి రాకేష్‌ కనిపించలేదు. దాంతో వారు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాల చేరుకున్నారు. చుట్టుపక్కల వెతకగా.. రేకుల షెడ్డులో విగతజీవిగా కనిపించాడు. రాకేష్‌ మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపారు.