బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

In BC Gurukula School Student suicide– సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కలకలం
నవతెలంగాణ- హుజూర్‌నగర్‌
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావుఫూలే బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో మంగళవారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్‌ అనిత, ఆర్సీఓ షకీల తెలిపిన వివరాల ప్రకారం..
పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెం మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలను హుజూర్‌నగర్‌లోని మిర్యాలగూడ రోడ్డు నందు ఉన్న పాత గాయత్రి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన వీరాచారి, ధనమ్మల పెద్దకూతురు శివాని(14) ఐదవ తరగతి నుంచి ఇదే పాఠశాలలో చదువుతోంది. ప్రస్తుతం 9వ తరగతి. ఇటీవల స్నేహితురాళ్లతో కలిసి రోడ్ల వెంట వెళ్లేవారికి హారు అని చెబుతున్నారని తెలిసింది. దాంతో ఎనిమిది మంది విద్యార్థినులను గుర్తించి టీచర్లు వారి పద్ధతి మార్చుకోవాలని చెప్పారు. అయినా.. వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సోమవారం తల్లిదండ్రులను పిలిచి మీటింగ్‌ నిర్వహించారు. 8 మందిలో ఆరుగురు విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చారు. విద్యార్థినుల ప్రవర్తన గురించి వారికి చెప్పారు. అంతకు ముందుకే ఒక విద్యార్థిని ఉప్పలమ్మ పండుగ ఉందని ఇంటికి వెళ్లింది. అందుబాటులో లేకపోవడంతో మంగళవారం వస్తామని శివాని తల్లిదండ్రులు టీచర్లకు చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున క్లాసురూమ్‌లో ఫ్యాన్‌కు శివాని ఉరేసుకుంది. నైట్‌ కేర్‌గా ఉన్న భరణి గమనించి ప్రిన్సిపల్‌కు, సిబ్బందికి సమాచారం అందజేశారు.
అయితే.. అంతకు ముందు మీటింగ్‌కు వచ్చిన తల్లిదండ్రులు బాలికల ప్రవర్తనపై టీచర్ల ముందే కొట్టడంతోపాటు తిట్టి ఇంటికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దాంతో తనను కూడా తల్లిదండ్రులు కొడతారేమోనన్న భయంతోనే శివాని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి శివాని ప్రవర్తనలో మార్పు ఉన్నట్టు స్నేహితులు చెప్పారు. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు ధర్నా చేశారు. పాఠశాలలో వేధింపుల వల్లే శివాని ఆత్మహత్య చేసుకున్నట్టు తమకు అనుమానం ఉందని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బాదె నర్సయ్య అన్నారు. శివాని ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు. ఈ ఘటనతో మిగతా విద్యార్థినులు ధైర్యం కోల్పోయే ప్రమాదం ఉందని, వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కోరారు.