గురుకులం’లో విద్యార్థిని ఆత్మహత్య

'గురుకులం'లో విద్యార్థిని ఆత్మహత్య– ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఘటన
– కుటుంబీకులు, బీఎస్పీ, ప్రజాసంఘాల ధర్నా
– జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత
– కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియాకు ప్రభుత్వానికి ప్రతిపాదన : అదనపు కలెక్టర్‌ వెంకట్‌ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట మండలం ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి(17) గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతోంది. శనివారం సాయంత్రం ఫేర్‌వెల్‌ డేలో వైష్ణవి పాల్గొన్నది. ఇదే సమయంలో తల్లికి వీడియో కాల్‌ చేసి ఫేర్‌వెల్‌ పార్టీ గురించి చెబుతూ.. చూపించింది. ఆ తర్వాత రాత్రి డార్మిటరీ హాల్‌కు వెళ్లిన వైష్ణవి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అయితే హాల్‌కు వెళ్లిన వైష్ణవి ఎంతకీ తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకు దించి రక్షించేందుకు యత్నించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమాచారం ఇచ్చారు. వైష్ణవి కొన ఊపిరితో ఉండటంతో అంబులెన్సులో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు వైష్ణవి మృతిచెందినట్టు చెప్పారు. హాస్టల్‌ సిబ్బంది ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. కూతురును విగతజీవిగా చూసి బోరున విలపించారు. శనివారం సాయంత్రం పాఠశాలలో ఫేర్‌వెల్‌ డే ఫంక్షన్‌ వీడియో కాల్‌తో తమతో నవ్వుతూ మాట్లాడిందని, ఇంతలోనే ఇలా ఎలా జరిగిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురు కొన్ని రోజుల కింద ఇంటికి వచ్చిన సమయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కలిసి ఎలా చదువుతున్నావని పలకరించారని చెప్పారు. హాస్టల్‌లో అన్నం బాగుండటం లేదని, రాళ్లు వస్తున్నాయని చెప్పగా.. అక్కడి నుంచే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఫోన్‌లో ప్రిన్సిపాల్‌తో మాట్లాడారని చెప్పారు. అప్పటి నుంచే వైష్ణవిని వేధించారని.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. వైష్ణవి మృతదేహంపై గాయాలు ఉండటంతో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు.
కళాశాల ఎదుట ఆందోళన
విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం గురుకుల కళాశాల ముందు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్‌, ఐద్వా ఆధ్వర్యంలోనూ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్‌వర్మ మాట్లాడుతూ.. వైష్ణవి అనుమాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కోటగోపి, ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ మాట్లాడారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, విద్యాలయలో సైక్రియాటిస్ట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా అధికారులు, పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి అక్కడికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా చెల్లింపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌ ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.