– సూసైడ్ నోట్ లభ్యం
నవతెలంగాణ-దుండిగల్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మైలారం కొత్త తాండాకు చెందిన బలరాంకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణి(18) దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల మెయిన్ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ మొదట సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్‌లోనే ఉంటోంది. శుక్రవారం ఉదయం ఆమె తనకు కడుపు నొప్పి వస్తోందంటూ తోటి విద్యార్థినులకు చెప్పింది. వారు క్లాసులకు వెళ్లగా శ్రావణి గదిలోనే పడుకుంది.
మధ్యాహ్నం క్లాస్ నుంచి తోటి విద్యార్థినులు వచ్చేసరికే రూమ్‌కు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపు కొట్టినా తెరవకపోవడంతో కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి తలుపు తెరవగా శ్రావణి ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించడంతో వెంటనే దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి విద్యార్థిని మృతదేహాన్ని సూరారంలోని మాల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ”కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా అమ్మా నన్ను క్షమించు” అని ఆమె రాసిన సూసైడ్ నోట్ లభించినట్టు సీఐ సతీష్ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కళాశాల ముందు కుటుంబ సభ్యుల ధర్నా
విద్యార్థిని కుటుంబ సభ్యులు కళాశాల వద్దకు చేరుకుని ధర్నా చేశారు. తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, రాత్రి తమతో ఫోన్‌లో మాట్లాడిందని అన్నారు. కళాశాల నిర్లక్ష్యం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని ఆరోపించారు. తాము రాకముందే మృతదేహాన్ని వారి ఆస్పత్రికే తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ కుర్చీలను విరగ్గొట్టారు. కుటుంబ సభ్యులకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.